AP GOVT: జాతీయ స్థాయికి మించి పెరిగిన ఏపీ తలసరి ఆదాయం
ABN , Publish Date - Jun 17 , 2025 | 07:27 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రణాళిక శాఖపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎస్ విజయానంద్, సంబంధిత అధికారులు హాజరయ్యారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ఇవాళ(మంగళవారం) ప్రణాళిక శాఖపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎస్ విజయానంద్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఏపీ ఎకానమీ, గ్రోత్ డ్రైవర్స్, జీఎస్డీపీ ప్రొజెక్షన్స్, కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్లపై సమీక్షించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయికి మించి ఏపీ తలసరి ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు. 2024-25కు జాతీయ స్థాయిలో సరాసరి తలసరి ఆదాయం 8.7 శాతంగా ఉంటే.. ఏపీ ఆదాయం 11.89 శాతం నమోదు చేసిందని అధికారులు సీఎం చంద్రబాబుకి వివరించారు.
తలసరి ఆదాయం, జీఎస్డీపీ, రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయనే అంశంపై అధికారులు అంచనాలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలంటే ఏం చేయాలనే అంశంపై డేటా అనలిటిక్స్ చేయాలని సూచించారు. సేవల రంగం అభివృద్ధి జరిగేలా దృష్టి పెడితే ఆర్థిక సుస్థిరతను సాధించగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రామస్థాయిలో కూడా కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే.. క్షేత్రస్థాయిలో పోటీతత్వం పెరుగుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు చేయడంతో పాటు.. పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
స్వర్ణ ఆంధ్ర విజన్ చర్చ
స్వర్ణ ఆంధ్ర విజన్ @2047ని పకడ్బందీగా అమలు చేయడం కోసం సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం యంగ్ ప్రొఫెషనల్స్‌ను నియమించాలని సీఎం నిర్ణయించారు. 48 నెలల పాటు పనిచేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కరి చొప్పున యంగ్ ప్రొఫెషనల్స్‌ని నియమించాలని అధికారులకు సూచించారు. ఏపీవ్యాప్తంగా 175 మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి అనుమతిస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు.
ఏపీలో ఇకపై ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు
అలాగే.. సర్క్యూలర్ ఎకనామి సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఏపీలో ఇకపై ప్లాస్టిక్ రహిత నగరాలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ లోగా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, 4 ప్రధాన నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని పూర్తిగా అరికట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ నగరాల్లో క్లాత్ బ్యాగ్స్ వినియోగం పెంచాలని సూచించారు. అలాగే 87 పట్ణణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News