CM Chandrababu ON Auto Drivers Scheme: ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:31 AM
ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్‌లు పాల్గొన్నారు.
అమరావతి , అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని (Auto Drivers Scheme) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఇవాళ(శనివారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్‌లు పాల్గొన్నారు.
తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం..
ప్రకాశం బ్యారేజీ లోటాస్ నుంచి ఆటోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్, నారా లోకేష్ బయలుదేరి.. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య గ్రౌండ్స్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఆటోలో ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్లతోనూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్, నారా లోకేష్ మాట్లాడారు. అయితే, ఆటో, క్యాబ్, ట్యాక్సీలను సొంతంగా కలిగి ఉండి.. వాటిని నడుపుకొంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్లకు సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర వారి ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం.
మంగళగిరిలో సందడి ..
అంతకుముందు.. ఉండవల్లి నుంచి ఆటోలో సింగ్ నగర్‌కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ బయలుదేరారు. ఉండవల్లి వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాధవ్‌లకు మంగళగిరి చేనేత కండువాలు కప్పి ఘనస్వాగతం పలికారు మంత్రి నారా లోకేష్. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌లకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చారు మంగళగిరి ప్రజలు. అందరినీ ఆత్మీయంగా పలకరించారు లోకేష్. బాణాసంచా, తీన్‌మార్ డప్పులతో మంగళగిరి యువత సందడి చేశారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు: మంత్రి లోకేష్
అయితే, ఆటోడ్రైవర్ల సేవలో భాగంగా ఆటోలో స్వర్ణలత అనే మహిళకు చెందిన ఆటోలో ప్రయాణించారు మంత్రి నారా లోకేష్. మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో మీరు చూపుతున్న చొరవకు హ్యాట్సాప్ అని లోకేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు స్వర్ణలత. సీఎం చంద్రబాబు చేతులమీదుగానే షీ ఆటోలను తమకు అందజేశారని ఆటోడ్రైవర్ స్వర్ణలత తెలిపారు. భార్యాభర్తలు కలసి చెరొక పని చేసుకుంటే కుటుంబాన్ని సులభంగా నడపొచ్చని చెప్పారు మంత్రి నారా లోకేష్. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News