CM Chandrababu Promises Prosperous: ఆనందాంధ్రను సాకారం చేస్తాం
ABN , Publish Date - Oct 04 , 2025 | 05:10 AM
సంక్షేమం, అభివృద్ధి, సాంకేతికతతో పాటు రాష్ట్రప్రజల ఆనందం కోసం విజయవాడ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలతో....
నా జీవితాశయం ఒక్కటే. నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రతి ఒక్కరినీ ఆనందంగా ఉంచేందుకు, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు బాధ్యత తీసుకొని ఏం చేయాలో అది చేస్తా. అందరూ ఆశీర్వదించి సహకరిస్తే ఆనందంగా ఉండే సమాజాన్ని నిర్మిస్తా.
ఏడాదిన్నర క్రితం వరకూ రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించలేదు. ఆ సమయంలో భయంభయంగా గడిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు స్వేచ్ఛ లభించింది.
నన్ను నమ్మి ఎంతో గొప్పగా ఆదరించారు
మిమ్మల్ని ఆనందంగా ఉంచుతా.. నాది హామీ
‘విజయవాడ ఉత్సవ్’ ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ(ఇబ్రహీంపట్నం)/విజయవాడ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధి, సాంకేతికతతో పాటు రాష్ట్రప్రజల ఆనందం కోసం విజయవాడ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలతో ’ఆనందాంధ్రప్రదేశ్’ను సాకారం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘విజయవాడ ఉత్సవ్’ ముగింపు వేడుకల సందర్భంగా గురువారం గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దసరా పండుగ గొప్పతనాన్ని చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్ విజయవంతమైందని తెలిపారు. ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే మైసూరు, కోల్‌కతా గుర్తొచ్చేవని, ఇప్పుడు విజయవాడ కూడా వాటి సరసన చేరిందని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్‌ను నగరంలో ఆరు ప్రాంతాల్లో నిర్వహిస్తే 2.5 లక్షల మంది వచ్చారని, దాదాపు 280 కార్యక్రమాలతో అద్భుతంగా చేశారని కొనియాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
‘‘గత ప్రభుత్వంలో అంతా విధ్వంసమే, దాడులు, కేసులు తప్ప ఏమీ లేదు. మా మిత్రులు పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి మీ దగ్గరకు వచ్చి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇస్తామని చెప్పాం. మమ్మల్ని నమ్మి 57శాతం ఓట్లు, 94 శాతం అభ్యర్థుల గెలుపుతో చరిత్ర సృష్టించేలా గెలిపించారు. మీ అందరినీ సంతోషంగా ఉంచాలన్న ఆలోచనలు చేస్తున్నాం. మరోపక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం.’

అమరావతిని ట్రాక్‌లో పెట్టాం
‘భవిష్యత్తులో కృష్ణా జిల్లాకు నీటి కొరత ఉండదు, ఉండబోదు. ఒకపక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, మరో పక్క కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను చూస్తుంటే కనుల పండువగా ఉంది. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పోలవరం కూడా పూర్తిచేసి జాతికి అంకితం చేసేవాళ్లం. కేంద్రం ఇచ్చిన రూ.15వేల కోట్లతో అమరావతిని తిరిగి ట్రాక్‌లో పెట్టాం. రూ. 50లక్షల కోట్ల పైబడి అమరావతి రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం..’
అధికార యంత్రాంగానికి సీఎం ప్రశంసలు
ఇంద్రకీలాదిపై నిర్వహించిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవంతం కావడంపై సీఎం అధికార యంత్రాంగాన్ని అభినందించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన 13 లక్షల మంది భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిందని ప్రశంసించారు. అమ్మలగన్న అమ్మ దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలని వేడుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.
సీఎంను ఆకట్టుకున్న రోబో చెఫ్
విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడిలోని ఎగ్జిబిషన్‌ను చంద్రబాబు సందర్శించారు. ఫుడ్ పెవిలియన్‌లోని రోబోటిక్ చెఫ్‌ను ఆయన ఆసక్తిగా గమనించారు. అది ఏఐ విధానంలో పనిచేస్తుందని పారిశ్రామికవేత్త అనిల్ సుంకర వివరించారు. చంద్రబాబు ఒక ఐటమ్‌ను ఆర్డర్ చేయగానే.. రోబో చెఫ్ స్టౌ వెలిగించి, గిన్నె పెట్టి నూనె పోసి కావాల్సినవన్నీ వేసి గరిటెతో తిప్పుతూ రుచికరమైన వంటకాన్ని వండి డెలివరీ చేసింది. ఆ వంట రుచి ఎలా ఉందో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో కలిసి సీఎం రుచి చూశారు.
మెగా కార్నివాల్‌కు గిన్నిస్ రికార్డు
విజయవాడ ఉత్సవ్ ముగింపు సందర్భంగా బందరు రోడ్డులో 3 వేల మంది కళాకారులతో నిర్వహించిన మెగా కార్నివాల్ అరుదైన ఘనత సాధించింది. 2 కిలోమీటర్ల పొడవున సాగిన ఈ ప్రదర్శనలో అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్నందుకు గిన్నిస్ రికార్డు లభించింది. ఈ ప్రదర్శనను సీఎం చంద్రబాబు, స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసక్తిగా తిలకించారు. ప్రదర్శన పూర్తయిన తర్వాత గిన్నిస్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను సీఎంకు ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, బిహార్ తదితర రాష్ర్టాల్లో ప్రసిద్ధిగాంచిన 40కి పైగా డప్పు కళా రూపాలు ఈ ప్రదర్శనలో ఆవిష్కృతమయ్యాయి. ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులు సిద్ధం చేసిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల శకటం అకట్టుకుంది.