CM Chandrababu: కుప్పం మహిళకు సీఎం చంద్రబాబు ఫోన్
ABN , Publish Date - Jun 17 , 2025 | 08:43 PM
కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిల్లల చదువుకు హామీ ఇచ్చారు.
అమరావతి: కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. అన్నివిధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషాకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు.
గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని సీఎం చంద్రబాబు అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని శిరీష వెల్లడించారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని బాధితురాలు తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.
వారిని బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా అండగా ఉంటానని....ధైర్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సీఎం హామీ ఇచ్చారు. ఎట్టిపరిస్థితిలోనూ నిందితులను వదిలిపెట్టనని తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరో మారు ఏపీలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ ఎంతటి వారైనా వదలనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఘటన, తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News