Stray Dogs: ఏపీలో వీధికుక్కల బెడద.. ఏబీసీ ఆపరేషన్‌తో కట్టడి చేసేందుకు యత్నం
ABN , Publish Date - Dec 15 , 2025 | 08:32 AM
అనంత నగరంలో వీధికుక్కలు 10 వేలకుపైగా ఉన్నాయంటే నమ్మడానికి చిత్రంగా ఉన్నా.. ఇది నిజం. వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఏ వీధికెళ్లినా గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి.
అనంతలో భారీగా పెరిగిన కుక్కల సంతతి
గుంపులుగా వీధుల్లో స్వైరవిహారం
జనంపై నిత్యం దాడులు
బైక్‌లను వెంటాడుతున్న వైనం
బెంబేలెత్తుతున్న నగర వాసులు
రోజూ 15 మందికి కాటు
అనంత నగరంలో వీధికుక్కలు (Stray Dogs) 10 వేలకుపైగా ఉన్నాయంటే నమ్మడానికి చిత్రంగా ఉన్నా.. ఇది నిజం. వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఏ వీధికెళ్లినా గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. నగర వీధుల్లోకి రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి. కాస్త దూరంలో కుక్క కనిపించినా.. భయమే. ఎక్కడ మీదికొస్తుందో.. ఎక్కడ కరుస్తుందోనని భయంభయంగా అడుగులేయాల్సిన దుస్థితి నెలకొంది. ద్విచక్రవాహనాల్లో వెళ్తున్నా.. వెంటాడుతున్నాయి. పట్టపగలే జనంపై దాడులు చేస్తున్నాయి. మీదపడి కరుస్తున్నాయి. రోజూ 15 మందిపై దాడి చేసి.. కరుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా నగర పాలక సంస్థ అధికారులు కట్టడి చర్యలు చేపడతారో.. లేదో..!
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): నగరంలోని 50డివిజన్లలో కుక్కల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అడుగడుగునా ఆందోళన వాతావరణం నెలకొంటోంది. వాహనదారులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చిన్నారులు వీధుల్లో భయపడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. గుంపులు గుంపులుగా కుక్కలు వీధుల్లో సంచరిస్తూ భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అనంత సర్వజనాస్పత్రికి రోజూ 15 మంది కుక్క కాటు బాధితులు వస్తున్నారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంత స్థాయిలో దాడులు చేస్తున్నా.. నగర పాలక సంస్థ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా కళ్లు తెరుస్తారో.. లేదో..!
గుంపులుగా దాడులు
అనంత నగర వీధుల్లో కుక్కలు గుంపులుగా చేరుతున్నాయి. దారిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. గుంపుగా వచ్చి.. కరుస్తున్నాయి. దీంతో నగర రోడ్లపై వెళ్లాలంటేనే జనం వణుకుతున్నారు. బైక్‌లపై వెళ్లేవారినీ వదలట్లేదు. వెంటాడుతున్నాయి. కొందరు కిందపడి గాయపడుతున్నారు. కిందపడినా వదలకుండా వారిపై దాడులు చేస్తున్నాయి. రాత్రిళ్లు కుక్కల బారి నుంచి తప్పించుకోవడమే గండం గట్టెక్కడమే. రోజూ 15 మందిని కుక్కలు కరుస్తున్నాయి.
వారిని రేబీస్ భయం వెంటాడుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు నగర పాలక సంస్థ అధికారులు కదిలారు. నగరంలో అనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) ఆపరేషన్ ద్వారా కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించారు. గతనెల 16వ తేదీన డంపింగ్ యార్డులో ఉన్న సెంటర్‌లో ఏబీసీ ఆపరేషన్ ప్రక్రియను హరియాణాకు చెందిన ఏజెన్సీ కింద పశువైద్యులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 649 కుక్కలకు ఆపరేషన్ చేశారు. తద్వారా కుక్కల పునరుత్పత్తి నివారించవచ్చు. దీనిని ఎంత మేర పూర్తి చేస్తారో.. మరి..
కుక్క కాటును తేలిగ్గా తీసుకోవద్దు
కుక్కకాటును తేలిగ్గా తీసుకోవద్దు. దారిలో వెళ్లే సమయంలో అకస్మాత్తుగా కుక్క దాడి చేసి కరిస్తే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. కరిచిన కుక్కను వారం పదిరోజులపాటు గమనించాలి. అది చనిపోతే రేబీస్ సంక్రమించే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తించాలి. కుక్క కరిచిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుక్క కాటుకి యాంటీ రేబీస్ టీకా 3 డోస్‌లు వాడాలి.
- డాక్టర్ శ్రీనివాసులు, సర్వజనాస్పత్రి అత్యవసర వైద్య విభాగాధిపతి
ఏబీసీతో కుక్కల వ్యాప్తి నియంత్రణ
నగరంలో కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తున్నాం. అందులో భాగంగా ఏబీసీ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించాం. వీధి, పెంపుడు కుక్కల సంఖ్య నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న మాట వాస్తవమే. ఏబీసీ ఆపరేషన్‌తో వాటి పునరుత్పత్తిని తగ్గించొచ్చు. కుక్కల సమస్యపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటున్నాం.
-బాలస్వామి, అనంత నగరపాలక సంస్థ కమిషనర్
ఈ వార్తలు కూడా చదవండి..
పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల
విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్
Read Latest AP News And Telugu News