Share News

Hyderabad: గాలి వాన బీభత్సం!

ABN , Publish Date - May 27 , 2024 | 05:05 AM

రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.

Hyderabad: గాలి వాన బీభత్సం!

  • రాష్ట్రవ్యాప్తంగా పలు ఘటనల్లో 12 మంది మృతి..!

  • కూలిన చెట్లు, స్తంభాలు, ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

  • ఉరుములు, మెరుపుల వాన.. విద్యుత్‌కు అంతరాయం

  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తీవ్రత అధికం

  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో షెడ్డు గోడ కూలి నలుగురు, పిడుగుపాట్లకు ఇద్దరు రైతులు, బాలుడి దుర్మరణం

  • సిద్దిపేట జిల్లాలో కోళ్లఫారం గోడ కూలడంతో ఇద్దరు, మేడ్చల్‌ జిల్లాలో బైక్‌పై కొమ్మలు పడి మరో ఇద్దరి మృతి

  • హైదరాబాద్‌లో వణికించిన గాలులుస్తంభించిన ట్రాఫిక్‌

అప్పటివరకు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందిపెట్టిన వాతావరణం అంతలోనే మారిపోయింది..! ఈదురుగాలి దుమారం రేపింది..! దీనికి పిడుగుల వర్షం తోడైంది..! ఇళ్ల కప్పులు ఎగిరిపోగా.. షెడ్లు కుప్పకూలాయి..! భారీ వృక్షాలు నేలకొరిగాయి.. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి..! వివిధ ఘటనల్లో 12 మంది ప్రాణాలు పోయాయి..! ఆదివారం సాయంత్రం రాష్ట్రంలో గాలివాన విలయం ఇది..!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు. గ్రామానికి చెందిన మల్లేష్‌ (38) రెండు నెలల క్రితం పొలంలో షెడ్డు నిర్మాణం చేపట్టాడు. పక్క గోడలు నిర్మిస్తున్నారు. మల్లేష్‌, భార్య పార్వతమ్మ, కుమారుడు రాజు, కుమార్తె అనూష (11) అక్కడికి వచ్చారు. కూలీలతో కలిసి పనిచేస్తుండగా వర్షం మొదలైంది. దీంతో గోడ పక్కన కూర్చున్నారు. ఇంతలోనే అది కూలి వారిపై పడింది. మల్లేష్‌, అనూషతో పాటు పెద్దకొత్తపల్లి మండలం ముష్ఠిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ(37) రాములు(40) అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా తిమ్మాయిపల్లిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. యాదాద్రి జిల్లా బొమ్మలరామారంనకు చెందిన నాగిరెడ్డి రామిరెడ్డి, ధనంజయ్య కీసర నుంచి శామీర్‌పేట వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బైక్‌ నడుపుతున్న రామిరెడ్డి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. తోటి ప్రయాణికులు గమనించి ధనంజయ్యను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.


బంధువుల ఇంటికి దావత్‌కు వచ్చి..

బంధువుల ఇంట దావత్‌కు వచ్చిన ఇద్దరిని మృత్యువు వెంటాడింది. సిద్దిపేట జిల్లా తూప్రాన్‌ మండలం గణపురం గ్రామానికి చెందిన గంగ గౌరీశంకర్‌ (30), చంద్రాయణగుట్ట వాసి భాగ్య(40) ములుగు మండలం క్షీరాసాగర్‌లోని చుట్టాల వద్దకు వచ్చారు. వారి పొలం వద్దకు వెళ్తుండగా వర్షం మొదలైంది. దీంతో పక్కనే ఉన్న పాత కోళ్లఫారం వద్దకు చేరుకున్నారు. ఈదురుగాలులకు గోడ కూలడంతో గౌరీశంకర్‌, భాగ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.


వాహనంపై సిమెంట్‌ ఇటుకలు పడి..

గాలివాన బీభత్సానికి రేకుల షెడ్డుపై ఉన్న సిమెంట్‌ ఇటుక వాహనంపై పడి కారు డ్రైవర్‌ మృతి చెందాడు. వికారాబాద్‌ జిల్లా బషీర్‌బాద్‌ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన వేణు (34) ప్రయాణికులతో శ్రీశైలానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. నాగర్‌కర్నూల్‌ సమీపంలోని మంతటి చౌరస్తా దగ్గర రోడ్డు పక్కనున్న షెడ్డుపై నుంచి సిమెంటు ఇటుకలు వేణు నడుపుతున్న వాహనంపై పడ్డాయి. అద్దం పగిలడంతో తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.


చెట్ల కిందకు వెళ్లి.. పిడుగుపాటుకు బలి

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం నంది ఒడ్డెమాన్‌లో రైతు అంజన్‌రెడ్డి (49), తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో రైతు కుమ్మరి వెంకటయ్య (55)లు పొలంలో పనిచేస్తుండగా వర్షం మొదలైంది. దీంతో వీరు సమీపంలోని చెట్ల కిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడటంతో ప్రాణాలు కోల్పోయారు. తెలకపల్లికి చెందిన మేకల కాపరి వెంకటయ్యకు భోజనం తీసుకెళ్లిన అతడి కుమారుడు దండు లక్ష్మణ్‌ (12) తిరిగొస్తుండగా వర్షం పడడంతో చెట్టు కింద నిల్చున్నాడు. పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. కోస్గి మండలం తొగాపూర్‌లో రెండు కోడెదూడలు పిడుగుపాటుతో మృతి చెందాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో బండిపై పిడుగుపడడంతో ఎల్కరి సత్తన్నకు చెందిన రెండు ఎడ్లు చనిపోయాయి.


హైదరాబాద్‌లో 40-50 కి.మీ. వేగంతో గాలులు

హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో 20 నిమిషాల పాటు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పెద్ద సంఖ్యలో భారీ వృక్షాలు నేలకూలాయి. ఓ దశలో మనిషి కొట్టుకుపోతారా? అనేంత వేగంతో గాలి వీచింది. గంటలపాటు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. వర్షం పది నిముషాలే పడింది. కానీ బలంగా వీచిన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వనస్థలిపురం గణేష్‌ ఆలయం రోడ్డులో భారీ చెట్టు పడడంతో వాహనాల రాకపోకలు గంటకుపైగా నిలిచిపోయాయి. కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. హయత్‌నగర్‌-1 డిపోలో భారీ వృక్షం పడడంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. డ్రైవర్ల రెస్ట్‌రూంల పై కప్పు రేకులు విరిగిపోయాయి. డిపోలో సైతం భారీ వృక్షం కూలి డిపో ప్రహరీ గోడ ధ్వంసమైంది. రాయదుర్గం, గచ్చిబౌలి, టీఎన్‌జీవో కాలనీ, గౌరవెలి ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రతకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీగలపై చెట్లు పడడంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. 3-4 గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. నగరంలో మధ్యాహ్నం 3 గంటలకు పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా మరికొన్నిచోట్ల వర్షం కురవడం గమనార్హం. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ, రాయదుర్గం, కొత్తగూడ, కొండాపూర్‌, లింగంపల్లి, తారానగర్‌, మియాపూర్‌, చందానగర్‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్‌ సర్కిల్‌, గచ్చిబౌలి ఔటర్‌ సర్కిల్‌ తదితరచోట్ల, ట్రాఫిక్‌ స్తంభించింది.

Updated Date - May 27 , 2024 | 05:16 AM