Share News

PM Modi : ఇక సమష్టి నిర్ణయాలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 02:47 AM

కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్‌డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్‌ భవనంలోని సెంట్రల్‌ హాలులో ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.

PM Modi : ఇక సమష్టి నిర్ణయాలు

 • ఎన్డీయే స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా.. జీవన నాణ్యతపైన దృష్టి

సారిస్తాం

 • సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాం

 • ఎన్డీయే ఎంపీలకు 24/7 అందుబాటులో ఉంటా

 • ఏపీ విజయం అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం

 • చంద్రబాబుకు పేదల సంక్షేమమే ముఖ్యం

 • పవన్‌ కేవలం పవన్‌ కాదు ఒక తుఫాను

 • కాంగ్రెస్‌ వచ్చే పదేళ్లలో కూడా వంద దాటదు

 • తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు విఫలమైంది

 • అందుకే మాకు రెట్టింపు సీట్లు: ప్రధాని మోదీ

 • ఎన్డీయే పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక

 • చంద్రబాబు, నితీశ్‌, పవన్‌, తదితరుల మద్దతు

న్యూఢిల్లీ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్‌డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్‌ భవనంలోని సెంట్రల్‌ హాలులో ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఎన్‌డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తానని ప్రకటించారు. వాజ్‌పేయి, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, జార్జి ఫెర్నాండెజ్‌, శరద్‌ యాదవ్‌, బాల్‌ ఠాక్రేలు వేసిన కూటమి బీజాలు ఇవాళ బలమైన వృక్షంగా మారాయని, ప్రజలు దానికి దోహదం చేశారని ఆయన చెప్పారు. ఆ మహానుభావుల వారసత్వం తనకు లభించినందుకు గర్వంగా ఉందన్నారు.

తన పక్కన ఉన్న ఎన్డీయే నేతలందరిలోనూ ఒక సమాన లక్షణం కనపడుతోందని, అదే సుపరిపాలన అని మోదీ చెప్పారు. తాను గుజరాత్‌లో ఉన్నా, చంద్రబాబు ఏపీలో ఉన్నా తమందరి పాలనలో కేంద్ర బిందువు పేదల సంక్షేమమేఅన్నారు. ఎన్‌డీఏ కూటమి భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అంకిత భావంతో పని చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. విపక్ష నేతలు చెబుతున్నట్లుగా తమనెవరూ ఓడించలేదని మోదీ అన్నారు. అదే సమయంలో ఓడిపోయిన వారిని అపహాస్యం చేయబోమని చెప్పారు. తాజా ఎన్నికల తీర్పు దేశం ఎన్‌డీఏ కూటమినే విశ్వసిస్తోందనే విషయాన్ని స్పష్టం చేసిందని మోదీ వ్యాఖ్యానించారు. గత పదేళ్ల పాలన ట్రెయిలర్‌ మాత్రమేనని తాను గతంలో చేసిన వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రసంగం కాదని, తన నిశ్చితాభిప్రాయమని మోదీ చెపారు. పార్లమెంటులోని అన్ని పార్టీలు తమకు సమానమేనన్నారు.


తన ప్రసంగంలో మోదీ ప్రతిపక్షాలపై సహజ శైలిలో చెణుకులు విసిరారు. ఇండియా కూటమి 2024 ఎన్నికలకే పరిమితమని భాగస్వామ్య పార్టీలు చెప్పడంలోనే వాటి అధికార దాహం స్పష్టమవుతోందని విమర్శించారు. ఎన్నికలు జరుగుతుండగానే విపక్షం ఈవీఎంలపై దుష్ప్రచారం కొనసాగించిందని, సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వారి నోళ్లు మూత పడ్డాయని మోదీ అన్నారు. ఈ వీఎంలను ప్రశ్నించే ప్రతిపక్షాలు ఈ శతాబ్దానికి చెందిన వారు కాదని తనకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఫలానా వారికి మంత్రిపదవులు వస్తున్నాయని మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను ఎంపీలు పట్టించుకోవద్దని మోదీ పిలుపునిచ్చారు. ఇవన్నీ తప్పుడు వార్తల్లో ఆరితేరిన ఇండీ కూటమి సృష్టేనని చెప్పారు. పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా దేశంలో అతి పురాతన పార్టీ అయిన కాంగ్రెస్‌ వంద సీట్లు కూడా సాధించలేక పోయిందని మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే పదేళ్లలో కూడా ఆ పార్టీ సీట్ల సంఖ్య వంద దాటబోదన్నారు. గత మూడు ఎన్నికల్లో కలిపి వారికి వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు ఈ ఎన్నికల్లో తమకు లభించాయని గుర్తు చేశారు. ఈ సారైనా ప్రతిపక్షాలు దేశ నిర్మాణానికి దోహదం చేస్తాయని, పార్లమెంట్‌ చర్చల్లో పాల్గొంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చే శారు.

 • అందరికీ అందుబాటులో ఉంటా

రానున్న పదేళ్లలో సుపరిపాలన, అభివృద్ది, జీవన నాణ్యతపై దృష్టి కేంద్రీకరిస్తుందని, సామాన్య ప్రజల జీవితాల్లో కనీస జోక్యం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తాను పూర్తిగా దేశానికి కట్టుబడి ఉంటానని, 24 గంటలూ ఎన్‌డీఏ ఎంపీలకు అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. దేశం కోసం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పారు. పోటీ స్ఫూర్తితో కూడిన సహకార సమాఖ్య విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసిస్తుందని తెలిపారు. పేదలు, మధ్య తరగతికి సాధికారికత కల్పించడం తమ ప్రాధాన్యత అని మోదీ ప్రకటించారు. ఎన్‌డీఏ అంటే ‘‘న్యూ, డెవల్‌పడ్‌, యాస్పిరేషనల్‌’’ ఇండియా అన్నారు.

 • మోదీ పేరును ప్రతిపాదించిన రాజ్‌నాథ్‌

సీనియర్‌ బీజేపీ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ పేరును ప్రతిపాదించారు. అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ బలపరిచారు. ఆనంతరం ఇతర ఎన్‌డీఏ నేతలు కుమారస్వామి, చంద్రబాబు, నితీశ్‌, ఏక్‌నాథ్‌ షిండే, చిరాగ్‌ పశ్వాన్‌, జతిన్‌రాం మాంఝీ, పవన్‌ కల్యాణ్‌లు మోదీని ప్రశంసిస్తూ ఆయన నాయకత్వాన్ని సమర్థించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి వచ్చిన దారుణ ఫలితాలకు తానే బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఫడ్నవీ్‌సను అమిత్‌ షా వారించినట్లు సమాచారం.


 • ఆడ్వాణీ, జోషిని కలిసిన మోదీ

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. రామ్‌నాథ్‌ నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. కోవింద్‌ కుటుంబసభ్యులతో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. అంతకుముందు ఎన్డీయే పక్షనేతగా ఎన్నికైన అనంతరం నేరుగా బీజేపీ కురువృద్ధుడు ఆడ్వాణీ ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషిని కలిశారు.

 • పవన్‌ తుఫాను

దక్షిణ భారతదేశంలో తమ కూటమి కొత్త చరిత్రను సృష్టించిందని మోదీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అతి పెద్ద విజయం లభించిందని చంద్రబాబుతో అన్నానన్నారు. జనసేన అధినేత పవన్‌ పవనం కాదని, తుఫాను అని మోదీ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో లభించిన భారీ విజయం అభివృద్ధి పట్ల సామాన్య మానవుడి ఆకాంక్షలకు ప్రతిబింబం అని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఇటీవలే ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అనతికాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మోదీ అన్నారు. అందుకే ఎన్‌డీఏ సీట్లు రెట్టింపు అయ్యాయని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. తమిళనాడులో సీట్లు రాకపోయినా ఓట్ల శాతం బాగా పెరిగిందని చెప్పారు.

కేరళలో తరతరాలుగా వేల మంది కార్యకర్తలు బలిదానం చేశారని, ఇవాళ పార్లమెంట్‌లో తమ ప్రతినిధి ప్రవేశించారని ఆయన అన్నారు. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, ఒడిసా విజయాలనూ ఆయన ప్రస్తావించారు. ఒడిసాలో జగన్నాథుడు పేదల దేవుడని, రాష్ట్రంరానున్న రోజుల్లో అభివృద్ధికిచోదక శక్తిగా మారుతుందని చెప్పారు.

Updated Date - Jun 08 , 2024 | 02:47 AM