Share News

AP Elections: అధికార పక్షంతో అంటకాగారు!

ABN , Publish Date - May 20 , 2024 | 04:43 AM

రాష్ట్రంలో పోలింగ్‌ రోజు(ఈ నెల 13న).. (AP Elections) ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..

AP Elections: అధికార పక్షంతో అంటకాగారు!

  • చివరి రోజు స్థానికుల నుంచీ సిట్‌ సమాచార సేకరణ

  • పోలింగ్‌, తర్వాతి విధ్వంసంపై పోలీసుల్లో ఉదాసీనత

  • హింసను తేలిగ్గా తీసుకున్న ఖాకీలు

  • పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ఎఫ్‌ఐఆర్‌లలో సాధారణ సెక్షన్లు

  • తలలు పగిలినా కనిపించని 307

  • ఊసేలేని ప్రజాప్రాతినిధ్య చట్టం

  • ‘సిట్‌’ దర్యాప్తులో వెలుగులోకి.. అర్ధరాత్రి దాటాక ఈసీకి నివేదిక?

  • తాడిపత్రిలో రాళ్ల దాడులపై సీఐ, ఎస్సైలను నిలదీసిన బృందం

  • దాడుల తర్వాతా బందోబస్తు పెంచలేదు

  • పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం

  • కొందరు అధికారులపై చర్యకు సిఫార్సు?

అమరావతి/తిరుపతి-ఆంధ్రజ్యోతి, తాడిపత్రి టౌన్‌/నరసరావుపేట, మే 19: రాష్ట్రంలో పోలింగ్‌ రోజు(ఈ నెల 13న).. (AP Elections) ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సంఘటనల తీవ్రతను బట్టి పెట్టాల్సిన సెక్షన్లు కూడా పెట్టలేదని.. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సేకరించిన సమాచారాన్ని బట్టి తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మహిళా ఏజెంట్లపై కత్తులతో దాడులు, ప్రతిపక్ష కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పిల్లల మెడపై కత్తిపెట్టి టీడీపీ ఏజెంట్‌ను బయటకు రప్పించడం.. నరసరావుపేటలో ఏకంగా టీడీపీ అభ్యర్థి వాహనంపైనే దాడిచేసి హత్యాయత్నానికి దిగడం వంటివి పెద్ద తీవ్రమైనవిగా పోలీసులు పరిగణించలేదు. మారణాయుధాలతో దాడులకు దిగిన వ్యక్తులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయలేదు. మాచర్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో సిట్‌ దీనిని గమనించింది. మరోవైపు.. తాడిపత్రిలోనూ పోలీసుల వైఫల్యం, ఏకపక్షంగా వ్యవహరించిన తీరు బయటపడ్డాయి. అక్కడ ఇరు వర్గాల దాడుల్లో బాలింత సైతం గాయపడినా మహిళలపై దాడులకు సంబంధించిన సెక్షన్లు నమోదు కాలేదు. ఇక తిరుపతిలో పోలీసులు మరీ ప్రేక్షక పాత్ర వహించారు. ప్రశాంతమైన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే వైసీపీ రౌడీలు రాడ్లు, కర్రలు, మద్యం సీసాలు,

సమ్మెటతో వచ్చి టీడీపీ అభ్యర్థిని అంతమొందించేందుకు చేసిన ప్రయత్నం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. అక్కడ కూడా తగిన సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని సిట్‌ గుర్తించినట్లు సమాచారం. ఎంత మంది రాళ్ల దాడుల్లో పాల్గొన్నారు.. ఇనుప రాడ్లు పట్టుకుని ఎందరు స్వైర విహారం చేశారు.. వారిని ప్రోత్సహించిన వ్యక్తులెవరు.. ఈ సమాచారాన్ని పోలీసులు పొందుపరచలేదు. నాలుగు చోట్లా పోలీసులు అధికార పార్టీలో అంటకాగినట్లు తేలింది. కొందరిని మాత్రమే అరెస్టు చేసి ఎక్కువ మంది బాధ్యులను వదిలిపెట్టడాన్ని సిట్‌ బృందాలు గుర్తించాయి. సిట్‌ ఏర్పడ్డాక అరెస్టవడం ఖాయమని తెలియడంతో.. పై నుంచి వచ్చిన సలహాల మేరకు ఆకస్మికంగా పరారైనట్లు బట్టబయలైంది. కీలకమైన కుట్రదారులు, క్రియాశీలంగా దాడులు చేసిన వారిని వైసీపీ అభ్యర్థులు డబ్బిచ్చి ఊళ్లు దాటించినట్లు.. కొందరినైతే సుదూర ప్రాంతాలకే పంపినట్లు తేలింది. వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు సిద్ధమవుతున్నాయి. అన్నిటికీ మించి.. పోలింగ్‌ రోజు అల్లర్లకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య (ఆర్‌పీ) చట్టం సెక్షన్లు ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నకు స్థానిక పోలీసుల నుంచి సమాధానం లేదు. సిట్‌ గుర్తించిన లోపాల్లో ఇది ప్రధానమైనది. ఈ వివరాలతోపాటు ఎక్కడెక్కడ ఏ పోలీసు అధికారి తప్పు చేశారు.. ఉద్దేశపూర్వకంగా పక్షపాతంతో పనిచేసిన వారెవరు.. మొదలైన అంశాలతో సిట్‌ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్లు తెలిసింది.

dfkl.jpg


తాడిపత్రిలో బందోబస్తుపై శ్రద్ధపెట్టలేదేం?

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాళ్ల దాడికి సంబంధించి సస్పెండైన పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ గౌస్‌బాషాను సిట్‌ విచారించింది. పోలింగ్‌ రోజున పట్టణంలోని ఓంశాంతి నగర్‌, పాతకోట ప్రాంతాల్లో రాళ్ల దాడికి కారణం ఎవరు.. ఎవరెవరి ప్రమేయం ఉంది.. ఎందుకు కట్టడి చేయలేకపోయారని వారిని సిట్‌ సభ్యులు డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ జీఎల్‌ శ్రీనివాస్‌ ప్రశ్నించినట్లు సమాచారం. దాడి జరిగాక కూడా బందోబస్తు పెంచడంపై ఎందుకు శ్రద్ధ పెట్టలేదని సూటిగా అడిగినట్లు తెలుస్తోంది. చాలినంత మంది సిబ్బందిని నియమించి ఉండి ఉంటే రెండోరోజు అల్లర్లు జరిగి ఉండేవి కాదనీ, ఆ మేరకు ఉన్నతాధికారులకు ఎందుకు నివేదించలేకపోయారని నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ బృందం తాడిపత్రి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపింది. పోలింగ్‌ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన హింసాకాండకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రాళ్లదాడిలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారో ఆరాతీశారు. 11-12 గంటలపాటు నిలదీయడంతో పోలీసు అధికారులు వణికిపోయారు. అనంతరం సిట్‌ సభ్యులు.. డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఇంకోవైపు.. రూరల్‌ స్టేషన్‌లో సిట్‌ బృందాన్ని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి కలిశారు. తన ఇంట్లో, కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు, ఫర్నిచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు.


దాడుల ప్రదేశాల్లో పరిశీలన

సిట్‌ బృందం తిరుపతి జిల్లాలో ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. రాత్రికే ప్రాథమిక నివేదికను సిట్‌ సారథి ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు సమర్పించినట్లు తెలిసింది. సిట్‌ సభ్యులైన ఏసీబీ డీఎస్పీ కె.రవిమనోహరాచారి, సీఐ ప్రభాకర్‌ శనివారం రాత్రి 10.30కు తిరుపతి చేరుకున్నారు. ఆలోపే వివిధ మార్గాల్లో చాలామటుకు సమాచారం సేకరించారు. ఆదివారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలింగ్‌ మర్నాడు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి వాహనం ధ్వంసం వంటి ఘటనలకు సంబంధించిన కేసుల ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలించారు. ఆ స్టేషన్‌ సీఐ మురళీమోహన్‌ నుంచీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రదేశాలనూ పరిశీలించారు. తర్వాత చంద్రగిరి మండలం కూచివారిపల్లి వెళ్లి పోలింగ్‌ రోజు రాత్రి హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను చూశారు. టీడీపీ వర్గీయులు తగులబెట్టిన వైసీపీ సర్పంచ్‌ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని, కారును పరిశీలించారు. గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం వద్ద గ్రామస్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

200 మందిని రప్పించి దాడులు!

పోలింగ్‌ రోజు వికలాంగుడితో ఓటు వేయించేందుకు యత్నించిన టీడీపీ ఏజెంట్‌ మురళీధర్‌ను రామిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ వర్గీయులు అడ్డుకుని దాడి చేసి కొట్టారని కూచివారిపల్లి గ్రామస్థులు ఆరోపించారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి రావడంతో ఆ పార్టీ సర్పంచ్‌ రామిరెడ్డిపల్లి నుంచి 200 మందిని రప్పించి తమపై దాడి చేయించారని సిట్‌ దృష్టికి తీసుకొచ్చారు. పలువురు తమ గాయాలను కూడా చూపించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లపైనా కేసులు పెట్టారని ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ కవిత చెప్పారు. పెద్దఎత్తున ఘర్షణ జరిగిందని, ఆ కారణంగా సర్పంచ్‌ ఇల్లు, కారు ఎవరు తగులబెట్టారో, మరో కారు ఎవరు ధ్వంసం చేశారో గుర్తించలేకపోయామని స్థానికులు వివరించారు. అనంతరం సిట్‌ అధికారులు పొరుగునే ఉన్న రామిరెడ్డిపల్లికి వెళ్లి మోహిత్‌రెడ్డి కారు డ్రైవర్‌ ఈశ్వరయ్యను విచారించారు. అలాగే చంద్రగిరి డీఎస్పీ శరత్‌ రాజ్‌కుమార్‌, సీఐ రామయ్యలతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో పలు లోపాలను సిట్‌ బృందం గుర్తించినట్లు సమాచారం. అలాగే ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంలో, హింసాత్మక ఘటనల నియంత్రణ, కేసుల నమోదులో బాధ్యతారహితంగా వ్యవహరించిన కొందరు అధికారులపై చర్యలకు సిఫారసు చేసినట్లు తెలిసింది. సిట్‌ చీఫ్‌ అనుమతితో ఈ ఘటనలపై మరింత లోతుగా విచారణ జరపాలని భావిస్తున్నట్టు సమాచారం. సుమారు 70-80 మందిని ప్రశ్నించాల్సి ఉందని, అప్పుడే ఏయే పోలీసు అధికారులు ఏ స్థాయిలో విఫలమయ్యారో అంచనా వేయడానికి వీలవుతుందని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.


వాస్తవాల గుట్టువిప్పని పోలీసు అధికారులు

పోలింగ్‌ రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పోలీసు అధికారులు పారదర్శకంగా వ్యవహరించలేదు. ముఖ్యంగా చంద్రగిరి మండలం కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లి గ్రామాల్లో పోలింగ్‌ రోజు వాస్తవంగా ఏం జరిగింది.. ఆ రోజు రాత్రి కూచివారిపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి కారకులు ఎవరన్నది ఇంతవరకూ వెల్లడించలేదు. పోలింగ్‌ మరుసటి రోజు పద్మావతి వర్సిటీలో టీడీపీ అభ్యర్థి నానిపై హత్యాయత్నం జరిగిన సందర్భంలో ఆయన గన్‌మన్‌ జరిపిన కాల్పుల్లో.. దాడికి యత్నించిన ఇద్దరు వైసీపీ నేతలు గాయపడిన విషయాన్ని కూడా బయటపెట్టలేదు. అలిపిరి సీఐ రామచంద్రారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దానిపైనా పోలీసు స్పందించలేదు. అసలు దాడి జరిగిందో లేదో కూడా స్పష్టత ఇవ్వలేదు. చిన్నపాటి కేసులపై కూడా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వివరాలు వెల్లడించే అధికారులు.. ఇంత తీవ్ర ఘటనలు జరిగినపుడు మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై సిట్‌ అధికారులు దృష్టి సారించారా అనేది చూడాల్సి ఉంది.

పల్నాడు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ల పరిశీలన

పోలింగ్‌ రోజున, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పలుచోట్ల సిట్‌ బృందం విచారణ చేపట్టింది. జిల్లా కేంద్రంలో నరసరావుపేట ఒకటో పట్టణం, రూరల్‌, మాచర్ల నియోజకవర్గం కారంపూడి, గురజాల నియోజకవర్గం దాచేపల్లి పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను, హింసాత్మక సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను సిట్‌ సభ్యులు పరిశీలించారు. జరిగిన అరాచక సంఘటనలపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ వివరాలను స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసులకు సంబంధించిన సెక్షన్లు, ఎంత మందిపై కేసులు నమోదు చేశారో వివరాలు సేకరించారు. కారంపూడిలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి స్వయంగా దాడులు చేయించారు. మారణాయుధాలతో స్వైరవిహారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను సిట్‌ పరిశీలించింది. నరసరావుపేట మండలం దొండపాడులో వైపీపీ మూకలు ఎంపీ, టీడీపీ లోక్‌సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై దాడి చేశాయి. రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. సిట్‌ సభ్యులు ఈ వివరాలనూ సేకరించారు. నరసరావుపేట దాడులకు సంబంధించి పూర్తిస్ధాయిలో కేసులు నమోదు చేయకపోవడాన్ని గుర్తించినట్లు సమాచారం. దాచేపల్లి మండలం తంగెడలో పోలింగ్‌ కేంద్రంపై వైసీపీ గూండాలు పెట్రోలు బాంబులతో దాడులు చేశారు. 13 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినా.. తేలికపాటి సెక్షన్లు నమోదుచేసినట్లు తెలిసింది. ఇరికేపల్లిలో జరిగిన అల్లర్లపై దాచేపల్లి స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లను సిట్‌ సభ్యులు పరిశీలించారు. జిల్లాలో హింసాత్మక సంఘటనలపై స్థానిక అధికారుల వైఫల్యాలపై కూడా వారు ప్రశ్నించినట్లు తెలిసింది. సిట్‌ దర్యాప్తు ముమ్మరం కావడంతో కేసుల్లో ఉన్న వైసీపీ నేతలు పలువురు స్వస్థలాలను విడిచి పరారైనట్లు సమాచారం.

Read Latest AP News and Telugu News


Updated Date - May 20 , 2024 | 07:33 AM