Share News

మేం మీ వాళ్లమే!

ABN , Publish Date - May 20 , 2024 | 04:17 AM

పోలింగ్‌ ముగిసి.. ఎన్నికల ఫలితాల కోసం పార్టీలు, ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. జూన్‌ 4 ఎప్పుడు వస్తుందా.. లెక్కలు ఎప్పుడు తేలతాయా అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు.

మేం మీ వాళ్లమే!

అనుమానించొద్దు.. అపోహలొద్దు

టీడీపీ నేతలకు కొందరు అధికారుల మొర

వైసీపీ ప్రభుత్వం చెప్పిన పనులే

సొంతగా మేమేమీ చేయలేదు

ప్రాధాన్యమిస్తామంటే ‘సమాచారం’ అందిస్తాం

అవకాశమిస్తే అధినేతతోనే మాట్లాడుకుంటాం

కొందరు అధికారుల రాయబారాలు

ఉత్తరాది బీజేపీ నేతలతో ఫోన్లు చేయించిన ఇద్దరు ఉన్నతాధికారులు

ఆచితూచి వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు

ఫలితాలొచ్చేదాకా మౌనమే!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలింగ్‌ ముగిసి.. ఎన్నికల ఫలితాల కోసం పార్టీలు, ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. జూన్‌ 4 ఎప్పుడు వస్తుందా.. లెక్కలు ఎప్పుడు తేలతాయా అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. ఈలోపే రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటింగ్‌ సందర్భంగా ప్రజల నాడిని బేరీజు వేసుకున్న అధికార వర్గాలు.. నెమ్మదిగా విపక్ష టీడీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తమపై ఉన్న ఒత్తిడి వల్ల దూరంగా ఉండాల్సి వచ్చిందని, తాము టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్లమేనంటూ కొందరు అధికారులు సంకేతాలు పంపుతున్నారు. సీఎం జగన్‌కు, ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితులని భావిస్తున్న అధికారులు సైతం ఇలాంటి సంకేతాలు పంపుతుండటం విశేషం. ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కొద్ది రోజుల క్రితం ఒక టీడీపీ నేతతో ఫోన్లో మాట్లాడారు. ‘నన్ను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను సర్వీసు చివరి దశలో ఉన్నాను. నేను మీకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చెప్పిన పనులు చేయడం తప్ప నేను సొంతంగా చేస్తున్నవి ఏమీ లేవు. నాపై అపోహలు పెట్టుకోవద్దు. మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అవకాశం ఇస్తే చంద్రబాబు గారితో కూడా మాట్లాడతాను. నన్ను టార్గెట్‌ చేస్తూ ప్రచారం చేయవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. మరి కొందరు అధికారులు కూడా ఇదే తరహా వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్‌ నేతకు వరుసగా రెండ్రోజుల్లో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు ఫోన్లు చేశారు. తమను వ్యతిరేకుల జాబితాలో చేర్చవద్దని, అధికారులుగా తమకు పార్టీలు ఉండవన్నారు. చంద్రబాబుకు తమ విషయం చెబితే ఆయనతో ఫోన్లో మాట్లాడుకుంటామని చెప్పారు. మరి కొందరు అధికారులు చంద్రబాబుకు సన్నిహితులెవరో ఆరా తీసే పనిలో పడ్డారు. తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి ఎవరి ద్వారా వెళ్తే కొత్త ప్రభుత్వంలో తమకు ఇబ్బందులు రాకుండా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు అధికారులు టీడీపీ నేతల ముందు కొత్త కొత్త ప్రతిపాదనలు పెడుతున్నారు.

జగన్‌ ప్రభుత్వంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై తమ వద్ద కొంత సమాచారం ఉందని, తమకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తే ఆ సమాచారం మొత్తం చేతికి ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. శాంపిల్‌ చూడాలంటూ కొన్ని అంశాలను చెబుతున్నారు. ఒక మహిళా అధికారి రెండ్రోజుల కింద ఓ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడికి ఫోన్‌ చేసి అవీ ఇవీ మాట్లాడారు. తన విషయం ఎప్పుడైనా చర్చకు వస్తోందా.. తనపై పార్టీ అధినేతకు ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నించారు. ఉత్తర భారతానికి చెందిన ఇద్దరు అధికారులు కూటమిలోని బీజేపీ నేతలకు తమ సొంత రాష్ట్ర బీజేపీ నేతలతో ఫోన్లు చేయించారు. తమను కొత్త ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని వారితో చెప్పించారు. ఈ అంశాలన్నీ ప్రస్తుతం టీడీపీ ముఖ్య నేతల మధ్య చర్చకు వస్తున్నాయి. ‘వారి పని వారు చేసుకుంటూ వెళ్లిన అధికారులతో మాకు ఇబ్బంది లేదు. కానీ జగన్‌ ప్రభుత్వంలో తీవ్ర ఆర్థిక అవకతవకల్లో భాగస్వాములుగా ఉన్న వారు... అడ్డగోలుగా అధికార పార్టీకి సహకరించిన వారి విషయంలో కఠినంగా ఉంటాం. టీడీపీ ప్రభుత్వాలు ఎప్పుడూ అధికారులను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ ఐదేళ్ల అనుభవాలతో కొందరు అధికారుల విషయంలో మేం కటువుగా ఉండక తప్పని పరిస్థితి’ అని ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఎక్కువ మంది టీడీపీ నేతలు మాత్రం ఫలితాలు వచ్చే వరకూ అధికారుల విషయంలో మౌనం వహించడం ఉత్తమమని భావిస్తున్నారు.

Updated Date - May 20 , 2024 | 04:17 AM