Share News

AUS vs NZ: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్.. వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే..

ABN , First Publish Date - 2023-10-28T12:46:35+05:30 IST

వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర స‌ృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన హెడ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. టీ20 స్టైలులో 59 బంతుల్లోనే సెంచరీ చేసి విశ్వరూపం ప్రదర్శించాడు.

AUS vs NZ: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్.. వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే..

ధర్మశాల: వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర స‌ృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన హెడ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. టీ20 స్టైలులో 59 బంతుల్లోనే సెంచరీ చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో వరల్డ్‌కప్ చరిత్రలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా హెడ్ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఈ ప్రపంచకప్‌లో వేగంగా సెంచరీ చేసిన ఓపెనర్‌గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలో 63 బంతుల్లోనే సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా వన్డేల్లో హెడ్‌కు నాలుగో సెంచరీ. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే ధాటిగా హెడ్ మొదట 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం మరింత రెచ్చిపోయిన హెడ్ 10 ఫోర్లు, 6 సిక్సులతో 59 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గాయం కారణంగా 6 నెలలపాటు జట్టుకు దూరంగా ఉన్న హెడ్ రీఎంట్రీలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే విధ్వంసకర సెంచరీ సాధించడం విశేషం. అది కూడా వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే కావడం గమనార్హం. అలాగే హెడ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ కావడం గమనార్హం. ఈ ప్రపంచకప్‌లో మూడో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన వీరిద్దరు మొదటి వికెట్‌కు 19.1 ఓవర్లలోనే 175 పరుగులు జోడించారు. మాట్ హెన్రీ వేసిన మొదటి ఓవర్లో వార్నర్ 2 ఫోర్లు బాదాడు. హెన్రీనే వేసిన మూడో ఓవర్లో వార్నర్ ఓ సిక్సు, హెడ్ రెండు సిక్సులు బాదడంతో ఏకంగా 22 పరుగులొచ్చాయి. బౌల్ట్ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ ఓ ఫోర్, సిక్సు బాదాడు. హెన్రీ వేసిన ఐదో ఓవర్ మొదటి మూడు బంతులను హెడ్ 2 ఫోర్లు, ఓ సిక్సు బాదాడు. దీంతో 4.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోర్ 50 పరుగులకు చేరుకుంది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో వేగంగా 50 పరుగులు పూర్తి చేసుకున్న జట్టుగా రికార్డు నెలకొల్పింది. వార్నర్, హెడ్ ధాటికి కివీస్ బౌలర్ హెన్రీ తన మొదటి 3 ఓవర్లలోనే ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు.

ఫెర్గ్యూసన్ వేసిన 7వ ఓవర్లో వార్నర్ రెండు సిక్సులు, హెడ్ ఓ ఫోర్ బాదడంతో 19 పరుగులొచ్చాయి. శాంట్నర్ వేసిన 9వ ఓవర్లో హెడ్ ఓ ఫోర్, సిక్సు, వార్నర్ ఓ ఫోర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్కోర్ 8.5 ఓవర్లలోనే 100 పరుగులకు చేరుకుంది. దీంతో ఈ ప్రపంచకప్‌లో వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా ఆసీస్ రికార్డు నెలకొల్పింది. అలాగే డేవిడ్ వార్నర్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ట్రావిస్ హెడ్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో వేగంగా హాఫ్ సెంచరీని చేసిన బ్యాటర్‌గా హెడ్ రికార్డు నెలకొల్పాడు. హెడ్, వార్నర్ విధ్వంసంతో ఆస్ట్రేలియా జట్టు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 118 పరుగులు చేసింది. మొదటి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా ఓవర్‌కు 12 పరుగుల చొప్పున సాధించింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. అన్ని ప్రపంచకప్‌లలో కలిపి పవర్ ప్లేలో ఇది మూడో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. మొదటి 10 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఓపెనర్లు ఏకంగా 10 సిక్సులు బాదడం గమనార్హం. ఆ తర్వాత కూడా హెడ్, వార్నర్ విధ్వసం కొనసాగింది. దీంతో ఆస్ట్రేలియా స్కోర్ 15 ఓవర్లలోనే 150 పరుగులు దాటింది.

F9gQzYiXoAAwbcW.jpg

అయితే ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని 20వ ఓవర్ మొదటి బంతికి స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ విడదీశాడు. 5 ఫోర్లు, 6 సిక్సులతో 65 బంతుల్లోనే 81 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడుతున్న వార్నర్.. బౌలర్ ఫిలిప్స్‌కే స్ట్రెట్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మిచెల్ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన హెడ్ 59 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆసీస్ స్కోర్ 23 ఓవర్లలోనే 200కు చేరుకుంది. అనంతరం 24వ ఓవర్లో మరోసారి చెలరేగిన స్పిన్నర్ ఫిలిప్స్ సెంచరీ హీరో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 67 బంతులు ఎదుర్కొన్న హెడ్ 10 ఫోర్లు, 7 సిక్సులతో 109 పరుగులు చేశాడు. ఆ వెంటనే మరోసారి చెలరేగిన ఫిలిప్స్ 18 పరుగులు చేసిన స్మిత్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 228 పరుగులకు ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది.

Updated Date - 2023-10-28T12:46:35+05:30 IST