Parliament launch row : నూతన పార్లమెంటు భవనం ప్రారంభం.. ప్రతిపక్షాలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఘాటు సమాధానం..

ABN , First Publish Date - 2023-05-24T20:03:12+05:30 IST

నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.

Parliament launch row : నూతన పార్లమెంటు భవనం ప్రారంభం.. ప్రతిపక్షాలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఘాటు సమాధానం..
Himanta Biswa Sarma

న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. గత తొమ్మిదేళ్లలో శాసన సభ భవనాలకు శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవాలు జరిగినపుడు బీజేపీయేతర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల గవర్నర్లను కానీ, రాష్ట్రపతిని కానీ ఆహ్వానించలేదని గుర్తు చేశారు.

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మే 28న ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాబోమని 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి కాకుండా ప్రధాన మంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువ లేదని ఆరోపించాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్‌ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఈ ప్రకటనను విడుదల చేశాయి. తెదేపా, వైకాపా, ఎస్ఏడీ, బీజేడీ ఈ కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించాయి. బీఆర్ఎస్ ఓ నిర్ణయం తీసుకోవలసి ఉంది.

ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, గడచిన తొమ్మిదేళ్లలో బీజేపీయేతర పార్టీలు/ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలు నూతన శాసన సభ భవనాలకు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలు చేశాయన్నారు. ఈ కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షులు కానీ చేశారన్నారు. ఈ కార్యక్రమాల్లో కనీసం ఒకదానికైనా ఆయా రాష్ట్రాల గవర్నర్లను కానీ, రాష్ట్రపతిని కానీ ఆహ్వానించలేదన్నారు. 2014లో జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల శాసన సభ భవనాలకు శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 2018లోనూ, ఛత్తీస్‌గఢ్‌లో 2020లోనూ, తెలంగాణలో 2023లోనూ ఇటువంటి కార్యక్రమాలు జరిగాయన్నారు.

2014లో జార్ఖండ్, అస్సాం శాసన సభ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు యూపీఏ ముఖ్యమంత్రులే చేశారన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానించలేదన్నారు.

2018లో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ భవనానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానించలేదన్నారు.

2020లో ఛత్తీస్‌గఢ్ శాసన సభ భవనం నిర్మాణానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ శంకుస్థాపన చేశారన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానించలేదన్నారు.

2023లో తెలంగాణ సచివాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని, ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానించలేదని చెప్పారు.

హిమంత బిశ్వ శర్మ బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ఇంత త్వరగా జరుగుతుందని ప్రతిపక్షాలు ఊహించలేదన్నారు. ప్రతిపక్షాలకు ఎదురు దెబ్బ తగిలేవిధంగా ప్రతి సంఘటన జరుగుతోందన్నారు. పార్లమెంటు భవన నిర్మాణాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని, అందువల్ల దాని ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడం సహజమేనని అన్నారు. ప్రతిపక్షాలు తమ నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం బహిష్కరణ నాటకం ఆడుతున్నాయన్నారు. వీర్ సావర్కర్‌ జయంతినాడు నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించబోతుండటం కూడా ఈ నాటకానికి ఓ కారణం కావచ్చునన్నారు.

అమిత్ షా స్పందన

కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా (Amit Shah) బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని తెలిపారు. దీనిని రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. దీని గురించి ప్రజలను ఆలోచించనిద్దామని, వారికి నచ్చిన విధంగా స్పందించనిద్దామని చెప్పారు.

గతంలో ఇందిర, రాజీవ్ కూడా..

కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి గతంలో జరిగిన ఇటువంటి కార్యక్రమాలను గుర్తు చేశారు. 1975 ఆగస్టులో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) పార్లమెంటు అనెక్స్‌ను ప్రారంభించారని, 1987లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) పార్లమెంటు గ్రంథాలయాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. మీ (కాంగ్రెస్) ప్రభుత్వాధినేత వాటిని ప్రారంభించినపుడు, మా (ఎన్డీయే) ప్రభుత్వాధినేత ఇప్పుడు అదే పని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ఆగ్రహం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభింపజేయకుండా, ఈ కార్యక్రమానికి కనీసం ఆమెను ఆహ్వానించకుండా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దేశ సర్వోన్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని ఆరోపించారు. పార్లమెంటు నిర్మితమయ్యేది దురహంకారపు ఇటుకలతో కాదని, రాజ్యాంగ విలువలతోనేనని చెప్పారు.

ఆర్డినెన్స్‌ను చింపేశారు కదా!

బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షేర్గిల్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, గతంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh)ను ఇబ్బందిపెడుతూ, మీడియా సమక్షంలో ఓ ఆర్డినెన్స్‌ను దురహంకారంతో చింపేశారన్నారు. నేడు ఆయన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే విషయంలో రాష్ట్రపతి పదవిని గౌరవించడం గురించి జ్ఞాన బోధ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ సమగ్రత, అఖండతల గురించి సలహాలు ఇవ్వడానికి ముందు ఆయన తన సొంత పార్టీ సహచరులను, సీనియర్లను ఎలా గౌరవించాలో నేర్చుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి :

New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

New Parliament Building : ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు

Updated Date - 2023-05-24T20:03:12+05:30 IST