New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-05-24T13:42:23+05:30 IST

న్యూఢిల్లీ: ఈనెల 28న జరగబోయే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు బుధవారంనాడు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఈనెల 28న జరగబోయే కొత్త పార్లమెంటు భవనం (New Parliament Buiding) ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు (Opposition parties) బుధవారంనాడు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

''కొత్త పార్లమెంటు భవనం ప్రారంభమవుతుండటం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నా, పార్లమెంటు భవన నిర్మాణం విషంలో విపక్షాలను ఏమాత్రం ఖాతర చేయకుండా నిరంకుశ ధోరణలో వ్యవహరిస్తూ వెళ్లినా, ఆ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి కార్యక్రమంలో పాల్గొనాలని అనుకున్నాం. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పూర్తిగా పక్కనబెట్టి తానే ప్రార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యంపై నేరుగా జరిపిన దాడిగా మేము భావిస్తున్నాం. రాష్ట్రపతి రాజ్యాంగ అధినేతే కాకుండా, పార్లమెంటు నిర్వహణలో కీలక బాధ్యతలు కలిగి ఉంటారు. సమన్లు ఇవ్వడం, ప్రొరోగ్ చేయడం, ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు. పార్లమెంటు చేసిన చట్టం అమలు కావాలన్నా ఆమె (రాష్ట్రపతి) సమ్మతి అనివార్యం. సంక్షిప్తంగా చెప్పాలంటే రాష్ట్రపతి లేకుండా పార్లమెంటు పని సాగించలేదు. అయినప్పటికీ ఆమె లేకుండానే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి నిర్ణయించారు. నిస్పందేహంగా ఇది అత్యున్నత రాష్ట్రపతి కార్యాలయాన్ని అవమానించడమే. రాజ్యాంగ స్ఫూర్తిగా పూర్తి విరుద్ధం. తొలి మహిళా ఆదివాసీని రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు దేశం గర్వస్తున్న తరుణంలో ఆ స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుంది'' అని ఆ సంయుక్త ప్రకటనలో విపక్షాలు పేర్కొన్నాయి.

''అప్రజాస్వామిక చర్యలు ప్రధానికి కొత్తమే కాదు. పార్లమెంటులో విపక్ష నేతలు భారత ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్ చేశారు. వారి మాటలను మ్యూట్ చేశారు. మూడు సాగు బిల్లులతో సహా అనేక వివాదాస్పద చట్టాలను ఎలాంటి చర్చా లేకుండా పార్లమెంటులో ఆమోదించారు. పార్లమెంటరీ కమిటీలకు మూలన పెట్టేశారు. ఏడాదిన్నర పాటు కరోనా మహమ్మారి సమయంలో భారీ ఖర్చుతో భారత ప్రజలతో కానీ, ఎంపీసతో కానీ ఎలాంటి సంప్రదింపులు లేకుండా నిర్మాణం జరిపారు. పార్లమెంటు నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టినప్పుడు ఇక కొత్త భవనంలో మాకు ఏ విలువా కనిపించడం లేదు. నిరంకుశ ప్రధాని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేయాలని సమష్టిగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ విషయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నాం'' అని ఆ సంయుక్త ప్రకటనలో విపక్షాలు తెలిపాయి.

19 పార్టీలు ఇవే...

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బష్కరిస్తున్నట్టు ప్రకటించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్‌ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఉన్నాయి.

Updated Date - 2023-05-24T13:42:23+05:30 IST