పంచాయతీరాజ్ సంస్కరణల్లో భాగంగా కూటమి ప్రభుత్వం డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీవో)లకు విశేష అధికారాలను అప్పగించింది. డీడీవోల జాబ్‌చార్ట్‌ను మారుస్తూ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. డివిజన్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే శాఖలన్నింటినీ ఒకే పరిపాలన నియంత్రణలోకి తీసుకురానున్నారు. డివిజన్ స్థాయిలో ఉన్న పంచాయతీ ఆఫీసు (డీఎల్‌పీవో), డ్వామా ఏపీడీ, ఇతర శాఖల డివిజనల్ కార్యాలయాలను డీడీవో కార్యాలయాల సముదాయంలోకి మారుస్తున్నారు. డివిజన్ స్థాయిలో ఈ డీడీవో కార్యాలయాలు మినీ కలెక్టరేట్లుగా ప్రజలకు సేవలందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. డీడీవోల బాధ్యతలు డివిజన్ స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలను డీడీవో నియంత్రిస్తారు. డివిజన్ స్థాయిలో అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ సమీక్షలు నిర్వహిస్తారు. పాలనాపరంగా ప్రతి నెలా కనీసం 20 రోజులు పర్యటించి టూర్ డైరీలను కలెక్టర్లకు సమర్పించాల్సి వుంటుంది. ఎంపీడీవోలతో పాటు డివిజన్ స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బంది మొత్తం డీడీవో నియంత్రణలో పని చేస్తారు. ఆరు నెలలకోసారి మండల పరిషత్ కార్యాలయాలను డీడీవో తనిఖీ చేస్తారు. స్థానిక ఎన్నికల బాధ్యత
స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైన ఫలితాలు ప్రజలకు చేరువ చేసేలా వీలైనన్ని డీడీవో కార్యాలయాలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుపతిలో కార్యాలయాలను గురువారం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇకపై రెవెన్యూ శాఖలో డివిజనల్ స్థాయిలో ఆర్డీవోలు మాదిరిగా డీడీవోలే అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు. డ్వామా ఏపీడీ, డీఎల్‌పీవోలు డీడీవోల పరిధిలో పనిచేస్తారు. తిరుపతి డివిజన్ డీడీవోగా నారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారు. మిగిలిన మూడుచోట్ల డీఎల్‌పీవోలు లేరు. డీడీవోలు డీఎల్‌పీవోలుగా వ్యవహరిస్తున్నారు. గూడూరుకు వాణి, శ్రీకాళహస్తికి సుస్మిత, సూళ్లూరుపేటకు జాలిరెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఇక నుంచి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు జిల్లా సమీక్షా మండలి సమావేశాలకు హాజరయ్యే అవకాశం లభించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ జిల్లా సమీక్షా మండలి సమావేశాలకు ఆయా జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మాత్రమే పాల్గొనేందుకు వీలుండేది. ఇపుడు అదనంగా జిల్లా పరిధిలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు కూడా ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారిని సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో ఆహ్వానించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో జిల్లా పరిధిలోని ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి.నరసింహ యాదవ్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ, ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ కూడా డీఆర్సీ సమావేశాల్లో పాల్గొననున్నారు. నిబంధనల ప్రకారం రెండు నెలలకొకసారి విధిగా డీఆర్సీ సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
చిత్తూరు పర్యటన నిమిత్తం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం రానున్నారు. ఉదయం 9.50 గంటలకు గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట నుంచి రోడ్డుమార్గాన చిత్తూరుకు 11.30గంటలకు చేరుకుంటారు. అక్కడ ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీవో కార్యాలయాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు నుంచి రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం వెళతారు.
శబరిమలైకు వెళ్లిన తండ్రీకుమారులు కారు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలోని కారణి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేణు(48) బేల్దారి కూలీ. కుమారుడు నరేష్(30) డ్రైవర్. వేణు, నరేష్, ఆయన కుమార్తె చాతుర్య అయ్యప్పస్వామి దీక్ష చేపట్టారు. ఈ నెల ఒకటో తేదీ ఉదయం వేణు, నరేష్, చాతుర్య(9)తో పాటు వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురానికి చెందిన మునితేజ కారణి గ్రామం నుంచి కారులో శబరిమలై అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో తమిళనాడు రాష్ట్రంలోని తేని పట్టణ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్ చేస్తున్న నరేష్, పక్కనే కూర్చున్న వేణు అక్కడికక్కడే మృతి చెందారు. మునితేజకు రెండు కాళ్లు విరిగిపోగా, చాతుర్యకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలకు తేని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మునితేజ అక్కడే చికిత్స పొందుతున్నాడు. గురువారం మృతదేహాలు కారణి గ్రామానికి వస్తాయని తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది వద్ద బుధవారం రాత్రి చొక్కాని ఉత్సవం వైభవంగా సాగింది. తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చుక్కాని ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవానికి ఒకరోజు ముందు అంటే మంగళవారం రాత్రి ఆలయంలో వేదపండితులు కలశస్థాపనతో కృతవును శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అమ్మవారి సన్నిధి వద్ద బాలదీపాలను వెలిగించి స్వామివారి సన్నిధి వద్ద భద్రపరిచారు. బుధవారం రాత్రి వరకు దీపాలు నిరంతరాయం వెలిగేలా ఏర్పాటు చేశారు. ఉదయం మహానంది వద్ద వేదపండితులు కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాటిచెట్టుకు శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. తాటిచెట్టును మహానంది వెనుకవైపున నిలబెట్టారు. చుట్టూ మట్టలను కప్పారు. రాత్రి ఆలయం నుంచి బాలాదీపాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా తాటిచెట్టు వరకు తీసుకువచ్చి ప్రదక్షిణలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి చొక్కాణిని వెలిగించారు. చొక్కాణి జ్యోతి అఖండ ప్రజ్వలనతో ప్రకాశించింది. ఈ ఘట్టాన్ని తిలికించేందుకు సాయంత్రం నుంచే భక్తులు వర్షంలో తడుస్తూనే నిరీక్షించారు. చొక్కాణి పూర్తయిన తర్వాత అందులోని భస్మాన్ని ఈశ్వరప్రసాదంగా భావించి భక్తులు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు మంచి ముహూర్తాల రోజులు కలిసి రావడంతో ఎక్కువ మంది రిజిస్ర్టేషన్లకు మొగ్గు చూపారు
ప్రభుత్వం పేర్కొన్న విధంగా మామిడికి మద్దతు ధర కిలోకు రూ.8 ఇవ్వాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు.
భారీ వర్షాలు కురిసినప్పుడల్లా పెనుమూరు మండలం కలవగుంటలోని ఎన్టీఆర్ జలాశయం నిండి పొంగి పొర్లుతోంది
బంగాళాఖాతంలో బలహీనపడిన దిత్వా తుఫాను స్థిరంగా ఉంది.