Share News

శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:18 AM

శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది

శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభంపై వృషభ సంకేత ధవళ పతకాన్ని అవనతం చేసి ధ్వజావరోహణం చేశారు. అంతకుముందు అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. ఆ తరువాత యాగశాలలో పది రోజుల నుంచి పూజలందుకున్న స్వామి అమ్మవార్ల ఆవాహన కలశాలకు పూజలు చేశారు. యాగశాల నుంచి కలశాలను అర్చకులు తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణ చేసిన అనంతరం స్వామివారి ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. ఆగమోక్తంగా కలశ ఉద్వాసన పలికారు. చివరిగా ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజవరోహణ క్రతువును పూర్తి చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి ఏర్పాటుచేసిన ధవళ పతాకం, దారాన్ని చతుర్మాడవీధుల్లో కొలువైన నవసంధి వినాయకులకు దర్శింపజేశారు. ఈ సందర్భంగా నవసంధి వినాయకులకు వీడ్కోలు పలికిన అర్చకులు తిరిగి ఆలయానికి చేరుకున్నారు.కాగా శివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి నూతన వధూవరులైన శివపార్వతులు సింహాసనం, కామధేనువుపై పురవిహారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా కేడిగ వాహన సేవ

శివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లకు కేడిగ వాహన సేవ వైభవంగా నిర్వహించారు.ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కేడిగ వాహనంపై అధిష్టింపజేసి పురవీధుల్లో ఊరేగించారు.

నేడు పల్లకిసేవ

శివరాత్రి ఉత్సవాల్లో శనివారం పల్లకిసేవ వుంటుంది. కల్యాణోత్సవ సమయంలో గంగాదేవిని వివాహమాడిన విషయాన్ని పరమశివుడు గోప్యంగా ఉంచడంపై ఆగ్రహంతో అమ్మవారు ముందుగా పల్లకీలో వెళ్లిపోతారు. వెనుక మరో పల్లకీలో జగదాంబను బుజ్జగిస్తూ సర్వేశ్వరుడు వెంబడించడం ఈ పల్లకీ సేవ పరమార్ధం. కోపంగా ఉన్న ఆదిశక్తిని అద్దం ద్వారా భక్తులు దర్శించుకుంటారు.

Updated Date - Feb 21 , 2026 | 12:18 AM