20 చెరువుల అనుసంధానానికి ప్రణాళికలు
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:23 AM
ముఖ్యమంత్రి ఆదేశాలతో తిరుపతిని సరస్సుల నగరంగా తీర్చి దిద్దడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
తిరుపతి సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి ఆదేశాలతో తిరుపతిని సరస్సుల నగరంగా తీర్చి దిద్దడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం తిరుపతిలోని తుడా కార్యాలయంలో చైర్మన్ దివాకర రెడ్డి, వీసీ గోవిందరావు, సెక్రటరీ శ్రీకాంత్‌బాబు, సీపీవో దేవికుమారి, అధికారులు కలిసి కేఎ్‌ఫడబ్ల్యూ, ఐసీఎల్‌ఐ, సౌత్‌ఏషియా వంటి అంతర్జాతీయ సంస్థలతో కీలక సమావేశం నిర్వహించారు. కేఎ్‌ఫడబ్ల్యూ సీనియర్ సెక్టార్ స్పెషలిస్టు కిరణ్‌కుమార్ అవధానుల్లా మాట్లాడుతూ.. భారత, జర్మనీ దేశాల అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా స్థిరమైన పట్ణణాభివృద్ధి అంశం కింద తిరుపతిలో 20 చెరువుల అనుసంధానానికి జర్మన్ డెవల్‌పమెంటు బ్యాంకు పరిధిలోని తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తొలి దశలో వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడం జరుగుతుందని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ హైడ్రాలికల్ సర్వే వివిధ నిపుణుల సహకారంతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడం జరుగుతుందని ఐసీఎల్‌ఈఐ సంస్థ డైరెక్టర్ జనరల్ మునికుమార్ చెప్పారు. రిటైర్డు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ పి.సుబ్బారావు మాట్లాడుతూ.. వాన నీటి సంరక్షణకు చర్యల కోసం ఐఐటీ నిపుణుల సహకారం తీసుకుని ఆధునిక పద్ధతులను పాటించాలన్నారు. స్వర్ణముఖి నదీ తీరాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఐఐటీ ఫ్రొఫెసర్లు కృష్ణప్రభువు, రోషన్లు చెరువుల అనుసంధానంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ శ్యాంసుందర్, ఇరిగేషన్ ఈఈ గిరిప్రసాద్, శివారెడ్డి ప్రస్తుతం తమ శాఖల ద్వారా నీటి సంరక్షణ చర్యలు, మురుగునీటి పారుదల వ్యవస్థలను వివరించారు. ఈ టీమ్ రానున్న మూడ్రోజులపాటు అన్ని చెరువులను స్వయంగా సందర్శించి, ప్రాథమిక సర్వే నిర్వహిస్తారని తుడా ఎస్‌ఈ రవీంద్ర తెలిపారు.