Share News

రెవెన్యూ మాయాజాలం

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:25 AM

కే పేరు.. ఒకే ఊరు.. వ్యక్తి, తండ్రి పేరూ ఒక్కటే.. ఇంటి పేరూ అదే.. అమ్మని భూమిని ఇతరులకు విక్రయించినట్లు చూపించేశారు

రెవెన్యూ మాయాజాలం

మదనపల్లె, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి):

ఒకే పేరు.. ఒకే ఊరు.. వ్యక్తి, తండ్రి పేరూ ఒక్కటే.. ఇంటి పేరూ అదే.. అమ్మని భూమిని ఇతరులకు విక్రయించినట్లు చూపించేశారు. ఇదంతా పొరపాటున జరిగిందని రిజిస్ర్టేషన్‌ శాఖ చెబుతుండగా బాధితుడు మాత్రం తెలిసే చేశారని, న్యాయం చేయాలని కోరుతున్నాడు.

మదనపల్లె మండలం పోతబోలు పంచాయతీ కొత్తగాండ్లపల్లె(కొత్తపల్లె)కు చెందిన ఓ వ్యక్తి పోతబోలు రెవెన్యూ గ్రామ సర్వే నంబర్‌74లో అదే గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి 50 సెంట్లు భూమిని ఇటీవల కొనుగోలు చేశారు. జనవరి 19వ తేదీన మదనపల్లె సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ చేశారు. కొనుగోలు చేసిన వ్యక్తి 25 సెంట్ల చొప్పున ఇద్దరి పేర్ల మీద రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. అయితే ఆయన కొనుగోలు చేసిన వ్యక్తికి సంబంధించిన భూమిని కాకుండా మరొకరికి చెందిన భూమిని రాయించుకున్నారు. ఆటోమ్యూటేషన్‌ వ్యవస్థ ద్వారా తనకున్న భూమి విస్తీర్ణంలో తగ్గిపోయినట్లు సమాచారం రావడంతో బాధితుడు ఆరా తీస్తే తనకున్న ఖాతా నంబర్‌ను భూమి రిజిస్ర్టేషన్‌లో చూపించినట్లు తేలింది. రిజిస్ర్టేషన్‌, మ్యూటేషన్‌ రెండూ అయిపోయాక ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో అటు రెవెన్యూ, ఇటు రిజిస్ర్టేషన్‌ శాఖ, మరోవైపు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. పేర్లలో అంతా ‘ఒక్కటే’ ఉండటం వల్ల పొరపాటు జరిగిందని, గుర్తించలేకపోయామని రిజిస్ర్టేషన్‌శాఖ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్‌ చెబుతుండగా, ఇదంతా తెలిసే చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. భూమి కొనుగోలు చేసే క్రమంలో విక్రయించే వ్యక్తి పేరున ఆన్‌లైన్‌ రికార్డు(వన్‌బీ, అడంగల్‌) ఉందా? లేదా? అనే విషయాన్ని ఎవరైనా ఒకటికి పదిసార్లు స్పష్టంగా తెలుసుకుంటారు. అందులోనూ అది పట్టా భూమి. అంతకుమించి రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసే క్రమంలో పొరపాటు అనే పదానికి అర్థమే లేదని చెబుతున్నారు. పైగా భూమిని విక్రయించిన రైతు పేరున ఆన్‌లైన్‌ వన్‌బీ లేదని తెలుస్తోంది. పేర్లంతా ఒక్కటే కావడంతో మరొకరి ఖాతానంబర్‌ను చూపించి రిజిస్ర్టేషన్‌ చేసేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు భాగస్వామున్న వారంతా ఇప్పుడు బాధపడుతున్నారు. భూమిని రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వ్యక్తి బయటి దేశంలో ఉండగా పిలిపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

గతంలోనూ ఇలాగే..

వ్యక్తిపేరు, తండ్రి పేరు ఒక్కటే కావడంతో నాలుగేళ్ల క్రితం మదనపల్లె మండలం పామయ్యగారిపల్లె రెవెన్యూ గ్రామంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రిజిస్ర్టేషన్‌ కూడా ఇక్కడి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో జరగగా అప్పట్లో కొన్నిరోజుల పాటు పెద్దవివాదమే నడిచింది. చివరకు అసలైన హక్కుదారులు, రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వ్యక్తి మధ్య జరుగుతున్న పంచాయితీ ఇప్పటికీ న్యాయస్థానంలో నలుగుతోంది. మదనపల్లె జిల్లా కేంద్రం కావడం, పైగా భూముల ధరలకు రెక్కలు రావడంతో ఇలాంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - Feb 21 , 2026 | 12:25 AM