ఇదిగో ఇస్తానంటూ ఐపీ పెట్టాడు
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:16 AM
‘మేమంతా ఒకటిన్నర రూపాయి వడ్డీకి డబ్బులిచ్చాం. డబ్బడిగితే ఇదిగో ఇస్తా అంటూ కాలయాపన చేశాడు
పలమనేరు, ఫిబ్రవరి20(ఆంధ్రజ్యోతి): ‘మేమంతా ఒకటిన్నర రూపాయి వడ్డీకి డబ్బులిచ్చాం. డబ్బడిగితే ఇదిగో ఇస్తా అంటూ కాలయాపన చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద లక్షలాది రూపాయలు అప్పుచేసి ఐపీ పెట్టాడు. రాత్రికి రాత్రే ఉడాయించాడు’ అంటూ పలమనేరులో శుక్రవారం రాత్రి వెంకటరావు ఇంటి ముందు బాధితులు లబోదిబోమన్నారు. రెండు రోజుల కిందట పి.వెంకటరావు రూ.13,14,50,000కు ఐపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు శుక్రవారం రాత్రి బోయవీధిలోని అతడి ఇంటికి చేరుకోగా తాళాలు వేసి ఉంది. దీంతో ఆ ఇంటికి వీరు మరో తాళం వేసి అక్కడే బైఠాయించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితులకు నచ్చజెప్పారు. వెంకటరావు ఐపీ దాఖలు చేసినందున కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఇంటి వద్ద ఎలాంటి చర్యలు తీసుకొన్నా చట్టపరంగా నేరం అవుతుందని చెప్పడంతో బాధితులు వెనుదిరిగారు.