• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

ప్రతికూలతను ఎదుర్కొంటేనే విజయం

ప్రతికూలతను ఎదుర్కొంటేనే విజయం

ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలడితేనే విజయం సొంతమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ నారా భువనేశ్వరి విద్యార్థులకు సూచించారు.కుప్పం నియోజకవర్గ పర్యటనలో తొలి రోజైన బుధవారంనాడు ఆమె ద్రావిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కొద్దిసేపు విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన అనంతరం వారినుంచి ప్రశ్నలను ఆహ్వానించారు. పలువురు విద్యార్థులు దీనిపై ఉత్సాహంగా స్పందించి, ఆమెపై ప్రశ్నలను సంధించారు. ప్రశ్నలన్నింటికీ భువనేశ్వరి ఓపిగ్గా, దీటుగా సమాధానం ఇచ్చారు. సీఎం చంద్రబాబులో మీకు నచ్చిన నాయకతవ్వ లక్షణం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సహనం కోల్పోకుండా, సమస్యను చక్కగా విశ్లేషించుకుని కార్యాచరణకు పూనుకునే లక్షణం తనకు ఎంతో ఇష్టమన్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని, సేవారంగమే సామాజిక రంగానికి బాటలు వేస్తుందని మరో విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఫలితం ఆశించకుండా సామాజిక సేవ చేయాలన్నారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, సమయ పాలన వంటి ఉత్తమ లక్షణాలు కలిగిన నందమూరి తారకరామారావు, నారా చంద్రబాబు నాయుడు నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంద న్నారు. విద్యార్థులు మొదట చదువుపైన దృష్టిపెట్టి కర్తవ్యం నిర్వహించాలని, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఉద్బోధించారు. పురుషులలో లేని, సహజమైన సహనశక్తి స్త్రీలకు సహజంగానే సంక్రమిస్తుందన్న భువనేశ్వరి, అందువల్లనే స్త్రీలు అన్ని పనులనూ సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటారని పేర్కొన్నారు. చంద్రబాబు మిన్నువిరిగి మీదపడ్డా చలించరని, ప్రతికూల పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయన చూపించే చొరవ తనకు బాగా నచ్చిన లక్షణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌.మునిరత్నం, కడా పీడీ వికాస్‌ మర్మత్‌,పీకేఎం ఉడా చైర్మన్‌ సురేశ్‌బాబు, ద్రావిడ వర్శిటీ వీసీ దొరస్వామి, రిజిస్ట్రార్‌ కిరణ్‌కుమార్‌, అకడమిక్‌ డీన్‌ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

ఆ ఐరిస్‌ స్కానర్లు వెనక్కొస్తాయా?

ఆ ఐరిస్‌ స్కానర్లు వెనక్కొస్తాయా?

వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ సరుకుల పంపిణీ కోసం ఎండీయూ ఆపరేటర్లకు సరఫరా చేసిన ఐరిస్‌ స్కానర్లను వెనక్కు తీసుకోవడం అధికారులకు తలనొప్పిగా తయారైంది.రేషన్‌ డీలర్ల స్థానంలో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి రేషన్‌ సరుకులను అప్పట్లో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ స్థానంలో రేషన్‌ డీలర్ల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతున్న విషయం తెలిసిందే.వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 1379 చౌకదుకాణాలకు 336 ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసి ఐరిస్‌ స్కానర్లను అందించారు. వాటిని వెనక్కివ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఎండీయూ ఆపరేటర్లను కోరినా ఇప్పటివరకు 275 స్కానర్లు మాత్రమే అధికారులకు చేరాయి. మిగిలిన 61 ఏమయ్యాయో తెలియడం లేదు. వెనక్కురాని స్కానర్లను ఈ నెలాఖరులోగా తెప్పించాలంటూ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు రావడంతో అధికారులు ఎండీయూ ఆపరేటర్లను వెతికే పనిలో పడ్డారు. కొందరు ఆపరేటర్లు బాధ్యత లేకుండా వాటిని మూలపడేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వెనక్కివ్వకుంటే ఒక్కో ఐరిస్‌ స్కానర్‌కు రూ.6400వంతున వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

రైతుల ఖాతాల్లో రూ.104.15 కోట్ల జమ

రైతుల ఖాతాల్లో రూ.104.15 కోట్ల జమ

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ యోజన కింద 1,54,908 రైతుల ఖాతాల్లో రూ.104.15 కోట్లు జమయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఈ నిధులను బుధవారం విడుదల చేయగా, ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలతో పాటు అన్ని సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి నాయుడుపేటలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు. ఈ పథకం, ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు, ఏడీ ధనంజయరెడ్డి, ఏవోలు గణేష్‌, గాయత్రి, ఏఎంసీ చైర్మన్లు ఉయ్యాల ప్రవీణ్‌కుమార్‌, ఆకుతోట రమేష్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

‘సివిల్స్‌’ ఉచిత కోచింగ్‌కు   దరఖాస్తు చేసుకోండి

‘సివిల్స్‌’ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోండి

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమనరీ పరీక్ష-2026కు సంబంధించి ఉచిత కోచింగ్‌ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులకు అత్యుత్తమ కోచింగ్‌, పుస్తకాలు, భోజనం, వసతి ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 120 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటికోసం ఈ నెల 26వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

మీపై మనీల్యాండరింగ్‌ కేసు

మీపై మనీల్యాండరింగ్‌ కేసు

‘మేము ముంబై సీబీఐ అధికారులం. మీపై రూ.583 కోట్ల మనీల్యాండరింగ్‌ కేసులో మీ పేరుంది. వాట్సాప్‌ కాల్‌ ద్వారా మిమ్మల్ని విచారిస్తున్నాం’ అంటూ డిజిటల్‌ అరెస్టు పేరిట భయపెట్టారు దీన్నుంచి బయట పడాలంటే రూ.80 లక్షలు పంపాలంటూ ఒత్తిడి చేశారు. ఇలా తిరుపతిలోని 65 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ నుంచి వివిధ ఖాతాలకు నగదు వేయించుకున్న ఎనిమిది మంది సైబర్‌ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరి జాయింట్‌ అకౌంటులోని దాదాపు రూ.2.5 లక్షలను ఫ్రీజ్‌ చేశారు. ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం తిరుపతిలో ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. డిజిటల్‌ అరెస్టుకు భయపడిన తిరుపతివాసి నుంచి రూ.80 లక్షలను వివిధ రాష్ట్రాల్లోని మ్యూల్‌ ఖాతాల్లోకి సైబర్‌ నేరగాళ్లు జమ చేసుకున్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు తిరుపతి ఈస్ట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో డీఎస్పీ భక్తవత్సలం స్వీయ పర్యవేక్షణలో ఎస్‌ఐలు, సిబ్బంది ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి నిందితుల కోసం గాలించారు. చివరికి డబ్బులు చేరింది ఎక్కడికంటే.. బాధితుడి అకౌంటు నుంచి రెండు మ్యూల్‌ అకౌంట్లకు నగదు జమ చేయించారు. ఆ మ్యూల్‌ ఖాతాల నుంచి 14 రాష్ట్రాల్లోని ఇతర అకౌంట్లకు ఆ మొత్తం చేరింది. చివరికి.. గేమింగ్‌ యాప్‌ వినియోగదారులకు ఆ మొత్తం చేరినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రధాన నిందితుడు కోటి బాబుకు టెలిగ్రామ్‌ ద్వారా హరియాణాలోని డానియల్‌, చైనాకు చెందిన టియాన్‌, ఇంకా డీ పేర్లతో ఉన్న విదేశీ నెట్‌వర్కులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది జనవరిలో కోటి బాబు కంబోడియాకు వెళ్లి 24 రోజుల పాటు సైబర్‌ నేరగాళ్లతో కలిసి పనిచేసి తిరిగి హైదరాబాదుకు వచ్చాడు. ఇక, క్రాంతి కుమార్‌, పవన్‌ కుమార్‌ కలిసి తప్పుడు పత్రాలతో డీకేకే ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ పేరిట జాయింట్‌ కరెంట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆ ఖాతాలోకి రూ.30 లక్షలు జమకాగా.. ఆ తర్వాత విదేశీ సైబర్‌ నెట్‌వర్క్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు నిర్ధారించారు. మరికొన్ని కేసుల్లోనూ ఈ ఖాతాను వినియోగించినట్లు బయటపడింది. వాటిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. అదనంగా, ఈ అకౌంట్‌ తెరవడంలో సంబంధిత బ్యాంక్‌ ఉద్యోగుల ప్రమేయం ఉందా అనేది దానిపైనా విచారిస్తున్నారు. అరెస్టయింది 8 మంది వీరే దండే క్రాంతికుమార్‌, నిమ్మల పవన్‌కుమార్‌ (అనంతపురం), మానే కోటిబాబు, గుండవేని గౌతమ్‌ (హైదరాబాదు), పరపాల శ్రీనివాస్‌ (రాజమండ్రి), ఎం.చంద్రశేఖర్‌, శివశంకర్‌, నగారిధన్‌ ప్రశాంత రెడ్డి (బళ్లారి) అరెస్టయిన వారిలో ఉన్నారు. ఇక, కీలక నిందితుడు హైదరాబాదులోని యూస్‌ఫగూడకు చెందిన మొహమూద్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

నేడు తిరుమలకు రాష్ట్రపతి రాక

నేడు తిరుమలకు రాష్ట్రపతి రాక

శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గురువారం తిరుమల రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద ఆమెకు స్వాగతం పలికేందుకు గవర్నర్‌ రావాల్సి ఉన్నా.. చివర్లో ఆయన రద్దయింది. దీంతో హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తదితరులు.. పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ అధికారులు స్వాగతం పలకనున్నారు. ఒడిశా నుంచి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో గురువారం సాయంత్రం 4గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన 4.30గంటలకు తిరుచానూరుకు వచ్చి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 5.20 గంటలకు బయలుదేరి తిరుమలకు వెళ్లి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9.20గంటలకు వరాహస్వామిని. ఆ తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకుంటారు. 11 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు బయలుదేరతారు.

స్వర్ణమ్మకు గంగా హారతి

స్వర్ణమ్మకు గంగా హారతి

కార్తీక మాసం.. అమావాస్యను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం స్వర్ణముఖి నదికి గంగా హారతులిచ్చారు. తొలుత ముక్కంటి ఆలయం నుంచి గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణముఖి నదిలోని సద్యోముక్తి ప్రదేశం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. నదీ జలాలకు, ఉత్సవమూర్తికి పండితులు పూజలు చేశారు. గంగాదేవికి శాస్త్రోక్తంగా సారె సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ అర్చకులు స్వర్ణమ్మకు ద్వాదశ(12) హారతులు పట్టారు. ఆగమ నియమాల ప్రకారం వివిధ రకాల హారతులను వరుసగా గంగమ్మకు సమర్పించారు. పలువురు భక్తులు నదీ దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంతో పాటు స్వర్ణముఖి నది వద్ద విద్యుత్తు అలంకరణలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌, బొజ్జల బృందమ్మ, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కొట్టే సాయి, సభ్యులు, ఈవో బాపిరెడ్డి, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

 యోగనరసింహుడిగా..   భక్తులను కటాక్షించిన పద్మావతి

యోగనరసింహుడిగా.. భక్తులను కటాక్షించిన పద్మావతి

తిరుచానూరులోని పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం ముత్యపుపందిరిపై అమ్మవారు శ్రీధనలక్ష్మి రూపంలో భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, వేద, ప్రబంధ పారాయణం, భజన బృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ తిరువీధుల్లో ముత్యపుపందిరి వాహనం ముందుకు సాగింది. మధ్యాహ్నం శ్రీకృష్ణ ముఖమండపంలో ఉత్సవమూర్తికి నేత్రానందంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి సింహవాహనంపై యోగనరసింహుడి రూపంలో అమ్మవారు తిరుమాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కళాబృందాల సాంస్కృతిక నీరాజనంతో అమ్మవారి సింహవాహన సేవ అత్యంత రమణీయంగా సాగింది. ఆయా కార్యక్రమాల్లో జీయర్‌ స్వాములు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్‌, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాసాచార్యులు బాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్లు రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, చలపతి, సుబ్బరాయుడు సుభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

స్విమ్స్‌లో స్టాఫ్‌ నర్సుల నియామకానికి నిర్ణయం

స్విమ్స్‌లో స్టాఫ్‌ నర్సుల నియామకానికి నిర్ణయం

తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో స్విమ్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమీక్ష జరిగింది. 236మంది స్టాఫ్‌ నర్సులు, 20మంది పారా మెడికల్‌ సిబ్బందితో పాటు 48 అడ్మినిస్ర్టేటివ్‌ పోస్టుల భర్తీకి గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

 నేటినుంచి భువనేశ్వరి కుప్పం పర్యటన

నేటినుంచి భువనేశ్వరి కుప్పం పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి బుధవారంనుంచి నాలుగురోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. నాలుగు మండలాల పరిధిలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొని వారి సాదకబాధకాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి