Share News

Tirupati: ది లాస్ట్‌ మీటింగ్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:58 AM

తిరుపతి నగరపాలక సంస్థ ప్రస్తుత కౌన్సిల్‌కు చివరి సమావేశం మంగళవారం జరగనుంది. పాలనాకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

Tirupati: ది లాస్ట్‌ మీటింగ్‌
తిరుపతి నగరపాలక సంస్థ

తిరుపతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థ ప్రస్తుత కౌన్సిల్‌కు చివరి సమావేశం మంగళవారం జరగనుంది. పాలనాకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. తొలుత రూ.350 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత సాదారణ సమావేశం జరగనుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తే అవకాశముంది.టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ విభాగాలపై వచ్చిన ఆరోపణలపై ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు జరిగే అవకాశాలున్నాయి.

23 సమావేశాల్లో 833 అంశాలపై చర్చ

2021 మార్చి 17న ఏర్పాటైన కౌన్సిల్‌ తొలి సమావేశం ఏప్రిల్‌ 22న జరిగింది. అప్పటినుంచి 23 కౌన్సిల్‌ సమావేశాలు జరిగాయి. మొత్తం 833 అంశాలపై చర్చించి కౌన్సిల్‌ ఆమోదముద్ర వేసింది. మంగళవారం జరగనున్న 24వ సమావేశంలో 44 అజెండా అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా 14 స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు జరిగాయి. కాగా మార్చి 17న వీడ్కోలు సభ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో 50 నెలలు, కూటమి ప్రభుత్వంలో 20నెలల పాటు కౌన్సిల్‌ కొనసాగగా చోటుచేసుకున్న విశేషాలివి. ఫశెట్టిపల్లెను తుడాకు అప్పగిస్తే లేఅవుట్లు వేసుకుని డబ్బు చేసుకుంటుందని, కార్పొరేషన్‌లో కలిపేస్తే దాదాపు 120 ఎకరాలు ఆస్తులుగా వస్తాయని భావించిన వైసీపీ కీలక నేతలు రాత్రికిరాత్రి నిర్ణయం తీసుకుని, కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శెట్టిపల్లె భూముల బాధ్యతను తుడాకు అప్పగించడం, ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కార మార్గం చూపడం తెలిసిందే.ఫకపిలతీర్థం నుంచి కరకంబాడి వరకు కొండ కింద మందారమాల పేరుతో రోడ్డు ప్రతిపాదన తెరపైకి తెచ్చారు కానీ పూర్తిచేస్తామని చెప్పి చేయలేకపోయారు.


వైసీపీ హయాంలో పునాదులు వేసిన మున్సిపల్‌ భవనం (సీవోసీ), మల్టీలెవల్‌ కార్‌పార్కింగ్‌ నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2024 ఎన్నిలకు ముందే వీటిని పూర్తిచేయాలనుకున్నారు కానీ 20 శాతం పనులు కూడా చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వ 90 శాతం పూర్తిచేసినప్పటికీ నిధులు లేక నిలిచిపోయాయి. ఫ మాజీ డిప్యూటీ మేయర్‌ అభినయ్‌ చిన్న, పెద్దవి కలిపి 18 మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను, పలు ఫ్రీ లెఫ్ట్‌లును అభివృద్ధి చేశారు. ఎస్వీయూ మీదుగా జూపార్కు రోడ్డును కలిపే మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు మాత్రం తీవ్రమైన అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

వైసీపీకి చెందిన మేయరు డాక్టర్‌ శిరీష పలు కౌన్సిల్‌ సమావేశాల్లో తన దృష్టికి తీసుకురాకుండానే అజెండాలో ఉంచిన పలు అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శెట్టిపల్లె పంచాయతీని కార్పొరేషన్లో విలీనం చేస్తున్న విషయం ఆమె దృష్టికి రాకుండా కౌన్సిల్‌లో చర్చకు రావడంతో ఆమె అసహనం వ్యక్తంచేశారు. అదేవిధంగా మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లపైన కూడా మేయరు తొలుత వెనకడుగు వేశారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను సాధారణంగా తుడా ఏర్పాటుచేస్తుందని, అయితే కార్పొరేషన్‌ ఆ బాధ్యత తీసుకోవడం సాధ్యమయ్యేనా? అని సందేహం వ్యక్తం చేశారు.

కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ తరపున 35వ డివిజన్‌ నుంచి గెలిచిన ఏకైక కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ. అధికార బలంతో 26 డివిజన్లను ఏకగ్రీవం చేసుకుని 23 డివిజన్లను దౌర్జన్యంగా తన ఖాతాలో వేసుకుని సంబరాలు చేసుకున్న వైసీపీకి ఆర్సీ మునికృష్ణ ఎదురునిలిచి టీడీపీ జెండా ఎగురవేశారు. కౌన్సిల్‌ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు దాడికి దిగేటంత పనికి ఒడిగట్టినా, అప్పటి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ఏక్‌ నిరంజన్‌ అంటూ హేళన చేసినా టీడీపీ తరపున తన గళాన్ని వినిపిస్తూ ఒంటరి పోరు చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ అయిన డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.

Updated Date - Feb 10 , 2026 | 01:58 AM