శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబుకు ఆలయ పెద్ద జీయర్ లేఖ
ABN , Publish Date - Feb 09 , 2026 | 09:22 PM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయానికి చెందిన పెద్ద జీయర్ స్పందించారు.
తిరుమల, ఫిబ్రవరి 09: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసిందని శ్రీవారి ఆలయ పెద్ద జీయర్ స్వామిజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై పెద్ద జీయ్యర్ సోమవారం స్పందిస్తూ.. సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాలు, లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
'ఇది ఘోర అపచారం.. ధర్మ విరుద్ధం.. అత్యంత బాధ్యతారహితమైన చర్య' అని పెద్ద జీయర్ స్వామి అభివర్ణించారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తుడైన సీఎం చంద్రబాబుకు ఆయన సూచించారు. 'ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు ఆలయాల పవిత్రతను కాపాడే శక్తిని మీకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని పెద్ద జీయర్ తన లేఖలో రాసుకొచ్చారు.