Tirupati: ఆరోగ్యానందాల్లో రెండో స్థానం
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:40 AM
ఆర్యోగానందాల్లో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కీలక అంశాలైన కుటుంబ ఆరోగ్యం, ఆనందాలలో జిల్లా 99 పాయింట్లు సాధించి ఏ ప్లస్ గ్రేడ్ అందుకుంది.
మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమీక్షలో వెల్లడైన ర్యాంకులు
తిరుపతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆర్యోగానందాల్లో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కీలక అంశాలైన కుటుంబ ఆరోగ్యం, ఆనందాలలో జిల్లా 99 పాయింట్లు సాధించి ఏ ప్లస్ గ్రేడ్ అందుకుంది. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో వివిద ప్రాధాన్యత రంగాలు, అంశాలలో జిల్లా దక్కించుకున్న ర్యాంకులు, స్కోర్ల వివరాలు ఇవీ.వార్షిక స్థూల ఉత్పత్తి విలువ పరంగా జిల్లా గతేడాదితో పోలిస్తే ఒక మెట్టు కిందకు జారింది. 2024-25లో రూ. 88,480 కోట్ల విలువైన ఉత్పత్తి సాధించి 13.30 శాతం వృద్ధి రేటుతో రాష్ట్రంలో 3వ ర్యాంకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. నిరుడు రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి విలువకు జిల్లా నుంచీ 5.56 శాతం తోడ్పాటు అందించాం. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా స్థూల ఉత్పత్తి విలువ రూ.98,526 కోట్లు కాగా 11.35 శాతం వృద్ధి రేటుతో 4వ ర్యాంకు సాధించింది. ఈ ఏడాదిలో రాష్ట్ర జీడీపీకి జిల్లా 5.59 శాతం తోడ్పాటు అందించింది. పారిశ్రామిక రంగం విషయానికొస్తే గతేడాది రూ. 32,838 కోట్లతో ఏపీలో 2వ ర్యాంకు సాధించింది. గతేడాది జిల్లా ఈ రంగంలో 7.06 శాతం వృద్ధి రేటు సాధించడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక రంగ ఉత్పత్తి విలువకు 9.35 శాతాన్ని జోడించింది. ఈ ఏడాది కూడా రూ. 35,989 కోట్లతో 2వ ర్యాంకు నిలుపుకుని 9.60 శాతం వృద్ది రేటు సాధించింది. రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి విలువకు 9.36 శాతం తోడ్పాటునందించింది. ఇక సేవా రంగంలో నిరుడు రూ. 31,885 కోట్లతో 14.90 శాతం వృద్ధి రేటు సాధించిన జిల్లా 4వ ర్యాంకు పొందింది. ఆ ఏడాది రాష్ట్ర సేవా రంగ విలువకు 5.14 శాతాన్ని జోడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36,195 కోట్లతో 13.52 శాతం వృద్ధి రేటు సాధించి 4వ ర్యాంకు నిలబెట్టుకుంది.
తలసరి ఆదాయంలో సీమలోనే టాప్!
వార్షిక తలసరి ఆదాయం విషయంలో రాయలసీమలోనే టాప్ అనిపించుకుంది. గతేడాది రూ. 3,18,036 కోట్ల తలస రి ఆదాయంతో 13.32 శాతం వృద్ధి రేటు సాధించి 5వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,53,351 కోట్లతో 11.10 శాతం వృద్ధి రేటు సాధించింది. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో 5వ ర్యాంకు నిలబెట్టుకుంది.
వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎగబాకిన స్థానం
వ్యవసాయ అనుబంధ రంగాల్లో జిల్లా గతేడాదితో పోలి స్తే 12వ స్థానం నుంచీ 14వ ర్యాంకుకు ఎగబాకింది. గతేడాది రూ. 17.,114 కోట్లతో 22.54 శాతం వృద్ధి రేటు సాధించి 14వ స్థానంలో నిలిచిన జిల్లా రాష్ట్ర ఉత్పత్తి విలువకు 3.42 శాతాన్ని జోడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 18.643 కోట్లతో 8.93 శాతం వృద్ధి రేటు సాధించింది.
రాష్ట్ర స్కోర్‌ను అధిగమించి
సేవా రంగంలో రాష్ట్ర సగటు స్కోర్ 87 కాగా జిల్లా దాన్ని అధిగమించింది. దీనికి సంబంధించి 7 ప్రామాణిక అంశాలలో 95 స్కోర్‌తో ఏ ప్లస్ గ్రేడ్ సాధించిన జిల్లా 4వ స్థానంలో నిలిచింది.