Annamayya: దిగజారిన తలసరి ఆదాయం
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:54 AM
అన్నమయ్య జిల్లా స్థూల ఉత్పత్తిలో రెండేళ్లుగా నిలకడగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయం గత ఏడాదితో పోల్చితే దిగజారింది.
అన్నమయ్య, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా స్థూల ఉత్పత్తిలో రెండేళ్లుగా నిలకడగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయం గత ఏడాదితో పోల్చితే దిగజారింది. వ్యవసాయ అనుబంధ రంగాల ఆదాయం నిలకడగా ఉంది. ప్రభుత్వ విద్యా రంగం పురోగమన దిశలో ఉంది. జిల్లాలో పర్యాటక రంగం సున్నాగా ఉండగా.. గుంతలు లేని రోడ్లలో రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో వివిద ప్రాధాన్యత రంగాలు, అంశాలలో జిల్లా దక్కించుకున్న ర్యాంకులు, స్కోర్ల వివరాలు వెల్లడయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఆదాయం రూ.36,443 కోట్లుకాగా ఈ ఏడాది రూ. 36,035కోట్లుగా ఉంది. వృద్దిరేటులో తగ్గుదల ఉంది.
తలసరి ఆదాయం గత ఆరిక సంవత్సరంలో రూ.2,18,411 కాగా ఈ ఏడాది రూ.2,14,902గా ఉంది. రాష్ట్ర స్థాయిలో 19 నుంచి 22వ స్థానానికి దిగజారింది. వృద్ధిరేటు కూడా తగ్గింది.
వ్యవసాయ అనుబంధ రంగాల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.15,076కోట్లు ఉండగా ఈసారి రూ.13,825కోట్లుగా ఉంది. 18వ స్థానంలో నిలిచింది.
పరిశ్రమల రంగ ఆదాయం గతంలో రూ.6,113 కోట్లుకాగా, ఈసారి రూ.5,277 కోట్లు వచ్చింది. 24వ స్థానంలో నిలిచింది.
సేవా రంగంలో గత ఆదాయం రూ.12,517 కోట్లు కాగా ఈసారి రూ.14,117 కోట్లు. 23వ స్థానంలో నిలిచింది.
రోడ్ల విస్తరణలో పురోగతి సాధించింది. 810.41 కిలోమీటర్ల లక్ష్యమైతే 1,205.38కిలోమీటర్లు సాధించింది.
సామాజిక సేవలో జిల్లా పనితీరు సంతృప్తికరంగా ఉంది. ఈ ఏడాది జిల్లా లక్ష్యం 59శాతం కాగా 59.29శాతం సాధించింది. ఇందులో నూటికి నూరు శాతం అభివృద్ధి సాధించింది.
బంగారు కుటుంబాలు 72,818 ఉండగా 12,754 కుటుంబాలను మాత్రమే సచివాలయ సిబ్బంది పరిశీలించారు. 17.51శాతం పురోగతి ఉంది.
జిల్లాలో ప్రసుత్తం రూ.178 కోట్ల అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికి రూ.151 కోట్లు ఖర్చు చేశారు. 85శాతం ఖర్చు చేశారు.
స్వచ్ఛభారత్ మిషన్(అర్బన్) అమలులో జిల్లా పనితీరు సంతృప్తికరంగా ఉంది. ఈ ఏడాది లక్ష్యం 100 అయితే 45.06 సాదించింది. 100శాతం సాధనపై దృష్టి సారించాల్సి ఉంది.
యుక్త వయస్సులో గర్భం దాల్చిన కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోల్చితే 10-12 శాతం అధికంగా ఉన్నాయి.
రాయలసీమ స్థాయిలో ప్రసిద్ధిచెందిన మదనపల్లె పట్టుచీరలను మార్కెట్లోకి సరఫరా చేసేందుకు ఏపీ స్టేట్ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. జిల్లాలో తయారయ్యే చెక్క బొమ్మలు, (రాజారాణి బొమ్మలు) మార్కెటింగ్‌కూ ప్రోత్సాహం లభిస్తోంది.
విద్యావ్యవస్థలో చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయి. టెన్త్ విద్యార్థుల 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో 14,174 మంది విద్యార్దులు 1567మంది ఏ గ్రేడ్‌లో, 4196 బీగ్రేడ్‌లో, 5633 మంది సీ గ్రేడ్‌లో 2044 మంది డీగ్రేడ్‌లో ఉన్నారు. ఇంటర్‌లో మొదటి సంవత్సరం ప్రీఫైనల్ పరీక్షల్లో 2964 మంది విద్యార్దులకుగానూ 1,317 ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 2,700 మంది విద్యార్థులకుగాను 1441మంది ఉత్తీర్ణత సాధించారు.
స్వర్ణ పంచాయతీల్లో పన్నుల విషయంలో వెనుకబాటు కనిపిస్తోంది. పాత బకాయిలు రూ.4.32కోట్లు, ప్రస్తుత బకాయిలు రూ.23.13కోట్లు కలిపి 27.45కోట్లు వసూలు కావాల్సి ఉంది. 8.48కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 33.46శాతం వసూలయ్యాయి.