Share News

Chittoor: జిల్లాకు పరిశ్రమల క్యూ

ABN , Publish Date - Feb 10 , 2026 | 02:01 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాకు పరిశ్రమలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పెద్దఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమల రంగాల్లో జిల్లా ర్యాంకు ఎగబాకింది.

Chittoor: జిల్లాకు పరిశ్రమల క్యూ

‘సంజీవని’తో జిల్లా ప్రజల ఆరోగ్యం ఇక డిజిటలైజ్డ్‌

మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష

చిత్తూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాకు పరిశ్రమలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పెద్దఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమల రంగాల్లో జిల్లా ర్యాంకు ఎగబాకింది. సేవా రంగంలో తటస్థంగా ఉంది. సోమవారం సీఎం చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అందులోని జిల్లా వివరాలు..

పరిశ్రమల రంగంతో ఆదాయం

పరిశ్రమల రంగంలో జిల్లా పురోగతి సాధిస్తోంది. 22 నుంచి 14కు మన జిల్లా ర్యాంకు ఎగబాకింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6842 కోట్లున్న ఆదాయం రూ.9760 కోట్లకు పెరిగి, వృద్ధి రేటు 8.62 నుంచి 42.65 శాతం సాధించింది. రాష్ట్రానికి జిల్లా వాటా 1.95 నుంచి 2.54 శాతానికి చేరింది. తిరుపతి గతేడాదిలాగే 2వ స్థానంలో కొనసాగగా.. అన్నమయ్య 23 నుంచి 24కు దిగజారింది.

జిల్లాలో క్యాబినేట్‌ ఆమోదించిన పరిశ్రమలు

పరిశ్రమ పెట్టుబడి(రూ.కోట్లలో) ఉపాధి

శ్రీజ మహిళా మిల్క్‌ ప్రొడ్యూసర్‌

కంపెనీ లిమిటెడ్‌ 282 400

ఏస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ 786.15 1000

మదర్‌ డెయిరీ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ 427 180

ఎస్వీఎఫ్‌ సోయా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 207.56 600

ఇవి కాకుండా ‘పయనీర్‌ క్లీన్‌ ఆమ్ప్‌స్‌’ అనే కంపెనీతో ఎంవోయూ పూర్తి చేసుకోగా, స్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) కూడా ఆమోదించింది. ఇది రూ.160 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉపాధి కల్పించనుంది.

అలాగే ‘రావోక్స్‌ అగ్రిటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమయిటెడ్‌’ కంపెనీ రూ.500 కోట్లతో 1500 మందికి ఉపాధి కల్పించనుండగా.. ఎంవోయూ పూర్తయింది. ఎస్‌ఐపీబీ ఆమోదించాల్సి ఉంది.

కుప్పంలో ఏర్పాటు చేయనున్న అలీప్‌ కంపెనీకు ఎస్‌ఐపీబీ ఆమోదించింది. ఇది రూ.45 కోట్లతో 1500 మందికి ఉపాధి కల్పించనుంది.

ఎంవోయూ కుదిరిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు

రెడ్‌ బెర్రీ ఫుడ్‌ లాజిస్టిక్స్‌ పెట్టుబడి రూ.277.94 కోట్లు. 2300 మందికి ఉపాధి. వచ్చే ఎస్‌ఐపీసీ సమావేశంలో ఆమోదిస్తారు.

జల్లికట్టు ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ పెట్టుబడి రూ.110కోట్లు. 1050 మందికి ఉపాధి. ఏపీఐఐసీ నుంచి 10 ఎకరాలు కేటాయించాల్సి ఉంది.

వైల్డ్‌ రూస్టర్‌ వెంచర్స్‌ పెట్టుబడి రూ.30 కోట్లు. 300మందికి ఉపాధి. ఏపీఐఐసీ నుంచి 30 ఎకరాలు కేటాయించాల్సి ఉంది.

జిల్లాలో రూ.2755 కోట్లతో ఆరు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయనుండగా, 12966 మందికి ఉపాధి లభించనుంది.


గ్రాస్‌ డిస్ర్టిక్ట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ (జీడీడీపీ) (జిల్లా జీడీపీ)

జిల్లా జీడీపీపీ విషయంలో మంచి వృద్ధి రేటు నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.42276 కోట్లున్న ఆదాయం.. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.49,303 కోట్లకు చేరింది. వృద్ధి రేటు 11.68 నుంచి 16.62 శాతానికి ఎగబాకింది. రాష్ట్రంలో మన జిల్లా స్థానం 20 నుంచి 17కు పెరిగింది. ఇక, తిరుపతి జిల్లా స్థానం 3 నుంచి 4కు పడింది. ఈసారికూడా అన్నమయ్య జిల్లా 24వ స్థానానికే పరిమితమైంది. రాష్ట్రానికి మన జిల్లా వాటా 2.66 శాతం నుంచి 2.80 శాతానికి పెరిగింది.

జిల్లా తలసరి ఆదాయం

జిల్లా తలసరి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10.89 నుంచి 16.38 శాతానికి వృద్ధి రేటు పెరిగింది. ఆదాయం రూ.2,16,603 నుంచి రూ.2,52,077కి పెరగడంతో ర్యాంకు 20 నుంచి 18కి ఎగబాకింది. తిరుపతి 5, అన్నమయ్య 22వ స్థానాల్లో ఉన్నాయి.

వ్యవసాయ అనుబంధ శాఖల ఆదాయం

గతేడాదితో పోల్చితే ఈ అంశంలో జిల్లా ఆదాయం పెరిగి రాష్ట్రంలో ర్యాంకు కూడా 17 నుంచి 15కు ఎగబాకింది. రాష్ట్రానికి జిల్లా వాటా మాత్రం స్ధిరంగా ఉంది. ఇదే అంశంలో తిరుపతి జిల్లా 14 ర్యాంకు నుంచి 12కు ఎగబాకింది. అన్నమయ్య మాత్రం 18వ ర్యాంకులో స్థిరంగానే ఉంది. రాష్ట్రానికి మన వాటా 3.12 శాతం అలాగే ఉంది.

సేవా రంగంలో అదే ర్యాంకు

గతేడాది సేవారంగంలో రూ.16,654 కోట్ల ఆదాయంతో మన జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 2.69 శాతం వృద్ధి రేటుతో రూ.18,875 కోట్లకు ఆదాయం పెరగ్గా.. 17వ ర్యాంకునే నిలబెట్టుకుంది. ఇక రాష్ట్రానికి మన జిల్లా వాటా 2.68 నుంచి 2.69 శాతానికి చేరింది. అదే సమయంలో తిరుపతి 4వ, అన్నమయ్య 23వ స్థానాల్లో ఉన్నాయి.

కుప్పంలో రెండు పైలెట్‌ ప్రాజెక్టుల విజయవంతం

సంజీవని, మాతృత్వ అనే రెండు పైలెట్‌ ప్రాజెక్టుల్ని కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకంగా అమలు చేసి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ‘సంజీవని’లో భాగంగా నియోజకవర్గంలోని 3 లక్షల మందికి ఆరోగ్య పరీక్షలు చేసి వారి వివరాలను డిజిటలైజ్‌ చేశారు. ప్రస్తుతం రెండో దశలో దీన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. జిల్లాలోని 19.75 లక్షల మంది ఆరోగ్య వివరాలను సేకరించనున్నారు. ‘మాతృత్వ’లో భాగంగా మాతా శిశు మరణాలను తగ్గించి, టీనేజ్‌ గర్భధారణను నియంత్రిస్తున్నారు.

కుప్పంలో ప్రైవేటు ఎంఎ్‌సఎంఈ పార్కు

అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక్కో ఎంఎ్‌సఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గంలో ప్రైవేటు ఎంఎ్‌సఎంఈ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించింది. ‘అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూయర్స్‌ ఆఫ్‌ ఇండియా’ ద్వారా రూ.6.18 కోట్ల పెట్టుబడితో 13.70 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. 2,500 మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి.

నిధుల వినియోగంలో వెనుకబాటు

యుటిలైజేషన్‌ ఆఫ్‌ అవైలబుల్‌ ఫండ్స్‌ విభాగంలో జిల్లా వెనుకబడి ఉంది. జిల్లాకు రూ.199 కోట్లు కేటాయించగా, రూ.146 కోట్లను మాత్రమే వినియోగించి రాష్ట్రంలో 25వ స్థానంలో ఉంది. ఇదే విషయంలో తిరుపతి జిల్లా రూ.188 కోట్లలో రూ.175కోట్లను వినియోగించి 3వ స్థానంలో.. అన్నమయ్య జిల్లా రూ.178 కోట్లలో రూ.151 కోట్లు వినియోంచి 13వ స్థానంలో ఉన్నాయి.

టెండర్‌ దశలో కుప్పం ఎయిర్‌పోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కుప్పంలో కొత్తగా ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. రూ.1142 కోట్ల అంచనా వేస్తుండగా, భూసేకరణ క్లియరెన్సు అందిన వెంటనే టెండర్లు పిలవనున్నారు. 1788 ఎకరాలు అవసరమని గుర్తించగా, 1112 ఎకరాలు సేకరించారు. ఈ నెలాఖరుగా భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యం చేసుకున్నారు.

పురోగతిలో మరిన్ని అంశాలు

సమగ్ర శిక్ష ద్వారా 516 పనులు (పాఠశాలలకు ప్రహరీ, అదనపు తరగతి గదులు వంటివి) రూ.41.31 కోట్లతో మంజూరవ్వగా, 163 పూర్తయ్యాయి. 273 పురోగతిలో ఉండగా, 80 పనులు ప్రారంభం కాలేదు.

మూడు జాతీయ రహదారులు నిర్మాణంలో ఉండగా, 9.15 కిలోమీటర్ల మేర (36.73 హెక్టార్లు) భూసేకరణ పెండింగులో ఉంది.

జిల్లాలో 18 రైల్వే లెవెల్‌ క్రాసింగులు ఉండగా 7 మంజూరయ్యాయి.

గ్రామ పంచాయతీల్లో రూ.30.67 కోట్ల పన్ను వసూళ్ల డిమాండ్‌కు గానూ రూ.11.36 కోట్లే వసూలు చేశారు.

ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకోసారి.. మొత్తం 49 ఉద్యోగమేళాలకుగాను 61 నిర్వహించారు. 358 కంపెనీలు పాల్గొని 3145 మందికి ఉపాధి కల్పించాయి.

మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంలో భాగంగా తిరుపతి, కుప్పంలో ‘చాయ్‌ రాస్తా’ అవుట్‌లెట్స్‌ ప్రారంభించారు. వీటిని డ్వాక్రా సంఘాల మహిళలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో 3909 బ్యాంకు ఖాతాల్లో రూ.6.55 కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ నిధులున్నాయి. వాటిలో 326 ఖాతాలకు ఈకేవైసీ చేసి, రూ.4 లక్షల్ని క్లెయిమ్‌ చేశారు.

వచ్చేనెల 15లోగా కేంద్రం నిధులు వినియోగిస్తాం

సీఎం చంద్రబాబు సమీక్షలో కలెక్టర్‌ వెల్లడి

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అందిన నిధులను మార్చి 15లోగా వినియోగిస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సోమవారం జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047 విజన్‌ లక్ష్యంలో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు, కార్యదర్శులు పాల్గొనగా, చిత్తూరు కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌ విధానంలో కలెక్టర్‌, ఎస్పీ తుషార్‌ డూడీ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ నరేంద్ర పాడెల్‌, సీపీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 1,04,727 పీడీ ఖాతాల్లోని అన్‌క్లైమ్డ్‌ డిపాజిట్లుగా వున్న రూ.148 కోట్లను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద జిల్లాలో రూ.30 కోట్ల పనులు జరుగుతున్నాయని కలెక్టర్‌ వివరించారు. గ్రామీణ ఆవాస్‌ యోజన ద్వారా గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మార్చి 15 లోగా 95 శాతం పనులు పూర్తిచేస్తామని తెలిపారు.

Updated Date - Feb 10 , 2026 | 02:01 AM