Cold wave: బాబోయ్.. జనవరిలోనూ గజగజ.. కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 07:30 AM
ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తున్నది. ఆరంభం నుంచే తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్నేళ్లుగా ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ పడిపోలేదని పలువురు చెప్తున్నారు. సాధారణంగా ఈ నెలాఖరున జనవరి మొదట్లో కొద్ది రోజులపాటు 10 డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
గజగజ వణుకుతున్న జనం
ఎన్నడూ లేనంతగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం
గిద్దలూరు టౌన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా చలి (Cold wave) వణికిస్తున్నది. ఆరంభం నుంచే తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్నేళ్లుగా ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ పడిపోలేదని పలువురు చెప్తున్నారు. సాధారణంగా ఈ నెలాఖరున జనవరి మొదట్లో కొద్ది రోజులపాటు 10 డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇందుకు భిన్నంగా గత 20 రోజుల నుంచే చీకటి పడగానే మంచు కురుస్తున్నది. ఉదయం 8గంటలు దాటుతున్నా సూర్యుడు కనిపించడం లేదు. సాయంత్రం 4గంటల నుంచే చలి మొదలవుతుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు స్వెటర్లు ధరించి బయటకి వస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతోపాటు చిన్నారులు జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బిడ్డలతో తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. రెండుమూడేళ్లలోపు వారిలో నిమోనియో వ్యాపిస్తున్నదని వైద్యులు చెప్తున్నారు.
తగ్గిన విద్యుత్ వినియోగం
చలి తీవ్రతతో విద్యుత్ వినియోగం పడిపోయింది. ఉదయం గ్రీజర్లు వాడుతున్నా మిగతా సమయాలలో విద్యుత్ వాడకం తక్కువగా నమోదవుతున్నదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులకు విద్యుత్ బిల్లులు కూడా తక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పూర్తిగా తగ్గిపోయింది.
జాగ్రత్తలు
సాయంత్రం 6 నుంచి ఉదయం 7గంటల వరకు చిన్నారులను బయటకు తీసుకెళ్లకూడదు.
ఏడాదిలోపు చిన్నారులను పట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
రాత్రి సమయాలలో ఏసీల వినియోగం పూర్తిగా మానేయాలి.
రూములో ఫ్యాన్లు వేయడం తగ్గించాలి.
చల్లని పదార్థాలను తినకూడదు.
గోరువెచ్చని నీళ్లు తాగాలి.
చిన్నారులకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా పోషకాహారం అందించాలి.
3 రోజులకు మించి జలబు, దగ్గు ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి.
ఆలస్యం చేస్తే ఊపిరితిత్తుల్లో రంధ్రాలు వాచిపోయి కృత్తిమంగా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ
Read Latest AP News And Telugu News