రెయిన్ అలర్ట్.. భాగ్యనగరంలో మరో గంటలో భారీ వర్షం
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:17 PM
భాగ్యనగరంలో వచ్చే మరికొన్ని గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో వచ్చే మరికొన్ని గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే 48 గంటల పాటు కొన్ని జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి వంటి పరిసర జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) అధికారులు హెచ్చరించారు.
6 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ హెచ్చరిక
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారిపోతోందని తెలిపారు. శనివారం నాటి వాతావరణ పరిస్థితి ఆధారంగా అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఆరు జిల్లాలు ఇవే: సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి. వర్షం పడే సమయంలో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.
శేరిలింగంపల్లిలో హై అలర్ట్: జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ప్రత్యేకంగా హెచ్చరించారు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో మొదలైన వర్షం
నగరంలోని శివారు ప్రాంతాలైన మొయినాబాద్, శంకరపల్లి, మోకిల, కొల్లూరు, తెల్లాపూర్, నాగులపల్లి, నల్లగండ్ల, పటాన్‌చెరు, బీహెచ్ఈఎల్, ఆర్సీపురం, అమీన్‌పూర్, కోకాపేట్, మణికొండ, హిమాయత్ సాగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే జల్లులతో కూడిన మోస్తరు వర్షం ప్రారంభమైంది. రేపు, ఎల్లుండి వాతావరణ సూచన ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే రెండు రోజులు (రేపు, ఎల్లుండి) కూడా రాష్ట్రంలో వర్షాల ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా జారీ చేసిన అలర్ట్‌ల వివరాలిలా..:
రెడ్ అలర్ట్
సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు రేపు(ఆదివారం) కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఆరెంజ్ అలర్ట్..
హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఎల్లో అలర్ట్..
సిద్దిపేట, జగిత్యాల, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
భారీ వర్షాలు, పిడుగులు పడే ముప్పు ఉన్నందున, అలాగే గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని తెలిపారు. చేతికొచ్చిన పంటలు, ధాన్యం తడిసిపోకుండా రైతులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉండటంతో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని తెలిపారు. జీహెచ్ఎంసీ, ఆయా జిల్లాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ డ్రైనేజీలు, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచారని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
విద్యానాణ్యత మెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. డీఈఓలకు కీలక ఆదేశాలు..
Read Latest Telangana News And AP News And National News And Telugu News