మరో అల్పపీడనం.. బంగాళాఖాతంలో 13న ఏర్పడే సూచనలు
ABN , Publish Date - Nov 07 , 2026 | 09:54 AM
ఈ నెల 13వ తేదీ ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
చెన్నై: ఈ నెల 13వ తేదీ ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెన్నై ప్రాంతీయ కేంద్రం వెల్లడించింది. అప్పటివరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటీవల వచ్చిన అర్నాబ్, మురసు తుపాన్ల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం తెలిపింది.
అదేసమయంలో అరేబియా సముద్రంపై ఆవహించివున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని కోస్తాతీర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా శనివారం మదురై, తేని, దిండుగల్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూర్, తంజావూరు, విరుదునగర్, తెన్కాశి, తూత్తుకుడి, రామనాథపురం, శివగంగై, పుదుకోట, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నెల 8వ తేదీ తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం, మైలాడుదురై, పుదుకోట, రామనాథపురం, తూత్తుకుడి, కన్నియాకుమారి జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోని ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, కల్లకుర్చి, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, శివగంగై, ఈరోడ్, తిరుపూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, తేని, తెన్కాశి, తిరుచ్చి సహా 19 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
9న తూత్తుకుడి, రామనాథపురంతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే, రాజధాని చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వుంటుందని, నగరంలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాలిగ్రామం, వడపళని, విరుగంబాక్కం, కోడంబాక్కం, నుంగంబాక్కం, అన్నా నగర్, టి.నగర్, ఎగ్మోర్, థౌజండ్లైట్తో సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరింది.
ఈ వార్తలు కూడా చదవండి:
దీపావళికి స్వీట్లు, డ్రైఫ్రూట్స్ అమ్మకాల్లో రికార్డులు
చర్లపల్లి-రక్సాల్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News