Share News

ఏపీకి మరో తుపాను ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:13 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.

ఏపీకి మరో తుపాను ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
cyclone alert andhra pradesh

విశాఖపట్నం, నవంబర్ 14: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడి.. తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రం మరో తుపానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.


ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. మరికొన్ని గంటల్లో బలపడి.. ఈ నెల16వ తేదీ వరకు తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో 18, 19వ తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో 18వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కాగా.. 19వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాటితో పాటు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు.. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ గాలుల వేగం క్రమంగా పెరిగే అవకాశం ఉందని.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు.. రేపు సాయంత్రం (ఆదివారం) వరకు తీరాలకు చేరుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

ఏపీ ఆర్థికాభివృద్ధికి రవాణా సౌకర్యాలు కీలకం

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 05:18 PM