పదేళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్
ABN, Publish Date - Jul 23 , 2026 | 08:38 AM
దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇంటర్‌నెట్ డెస్క్, జులై 23 (ఆంధ్రజ్యోతి): దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సగటున నెలకు ఒక పేపర్ లీక్ అవుతున్నా బాధ్యులైన వారికి పడిన శిక్షలు మాత్రం ‘సున్నా’ అని ధ్వజమెత్తారు. బుధవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
పోలీసుల లాఠీ దెబ్బలకు గాయపడిన విద్యార్థుల ఆక్రందనల దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. ఒకప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత విద్యా వ్యవస్థ.. మోదీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు, లీకేజీలకు నిలయంగా మారిందని మండిపడ్డారు. దేశంలో పేపర్ లీకేజీలు ఒక పెద్ద మాఫియాగా మారాయని, దీని వెనుక ఉన్న బడాబాబులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కంటితుడుపు చర్యలకు స్వస్తి చెప్పి, పటిష్ఠ చట్టాలు తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated at - Jul 23 , 2026 | 08:42 AM