Share News

పులుపులో దాగిన తియ్యదనం

ABN , Publish Date - May 10 , 2026 | 12:36 PM

బద్దలంటే ముక్కలు. మాగాయిముక్కని ‘మాగాయిబద్ద’ అంటారు. ‘చీబద్ద’ అనే పదం వర్ణవ్యత్యయం జరిగి ‘చీదబ్బ’ అయ్యింది. పెద్ద తొనలు విడదీయగలిగే స్వభావం వలనే ఈ పండు దబ్బపండు అయ్యింది.

పులుపులో దాగిన తియ్యదనం
Dabbapandu

బద్దలంటే ముక్కలు. మాగాయిముక్కని ‘మాగాయిబద్ద’ అంటారు. ‘చీబద్ద’ అనే పదం వర్ణవ్యత్యయం జరిగి ‘చీదబ్బ’ అయ్యింది. పెద్ద తొనలు విడదీయగలిగే స్వభావం వలనే ఈ పండు దబ్బపండు అయ్యింది. ముక్కలు (తొనలు) కలిగిన పండు దబ్బపండు. కమలా, బత్తాయి లాంటి పళ్లు మనకి రెండుమూడు శతాబ్దాల కాలంలో పరిచయం అయినవే! తొనలు కలిగిన నారింజ, దబ్బ ఆదిమ కాలం నుంచి మన సంస్కృతిలో భాగంగా ఉన్నాయి.

దబ్బలో దూదిదబ్బ, నారదబ్బ అని రెండు రకాలున్నాయి. మందపాటి తోలు ఉండి దాని అడుగున దూది పొరలుండేది దూది దబ్బ. నార లేదా పీచు ఎక్కువగా ఆవరించి ఉన్నది నారదబ్బ. దానికే నారదం, నారంగరంగం, నారంగం, నారింజ అనే పేరు ఏర్పడింది. నారింజ అనే తెలుగు పేరులో ‘నా’ లోపించి ఇంగ్లీషువాడి నోట ఆరెంజయ్యింది.


దబ్బపండు తోలు, గింజలు, తొనలు ఆహారానికే కాదు, వైద్యానికి కూడా పనికొస్తాయి. పేగుల్లో వచ్చే వ్యాధుల్లో దీని ప్రయోగం ఎక్కువ. మొలల వ్యాధిలో ఇది ప్రముఖమైన ఔషధం కూడా. పుల్లనిదైనప్పటికీ వేడినీ, వాతాన్నీ, కఫాన్ని, వాంతి, వికారాలను తగ్గిస్తుంది. దబ్బ రసం ఇస్తే మద్యం మైకం దిగిపోతుంది. వెక్కిళ్లు ఆగుతాయి. దగ్గు, ఆయాసం తగ్గుతాయి. దబ్బపండ్లు ఎముక పుష్టినిస్తాయి. కండరాలు బలసంపన్నం అవు తాయి. కిడ్నీ, లివర్లను శక్తిమంతం చేస్తాయి. గుండెకు టానిక్‌లాగా పని చేస్తాయి. కండరాలు శుష్కించిపోయే వ్యాధిలో మేలు చేస్తాయి. బాగా పండిన దబ్బలో సి-విటమిన్‌ అధికంగా ఉంటుంది. పొయ్యెక్కించకుండా దబ్బరసంతో వంటకాలు చేసుకోవాలి. వేడి తగిలితే చేదు వస్తుంది.


దబ్బపానీయం: దబ్బ తొనల్ని వలిచి, కొద్దిగా సైంధవలవణం, అల్లం రసం కలిపి, కొద్దిసేపు ఉంచితే తొనల లోపల ముత్యాల నుంచి రసం బయటకొస్తుంది. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. లివర్‌కు మంచిది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. విరేచనం అయ్యేలా చేస్తుంది. ఉదయంపూట తాగితే మంచిది. వేసవిలో వడకొట్టకుండా ఉపయోగ పడే పానీయం. మెనోపాజ్‌ వచ్చిన స్త్రీలు ప్రతీ రోజు దబ్బపానీయం తాగుతుంటే మంచిది!

దబ్బ పప్పు: కందిపప్పు లేదా పెసరపప్పుని ఉడికించి, చల్లారాక అందులో దబ్బరసం, ఉప్పు, కారం కలిపి, తాలింపు పెట్టిన దబ్బ పప్పు ఆరోగ్యానికి మంచిది.


book7.jpgదబ్బ పులిహోర: చింతపండు రసానికి బదులుగా దబ్బరసం కలిపి, తాలింపు పెట్టిన పులిహోర రుచికరంగా ఉంటుంది. ఆవపిండి, మెంతిపిండి కూడా కొద్దిగా కలిపితే మేలుచేస్తుంది.

దబ్బకారం: ఓ బాండీలో కొంచెం నూనె లేదా నెయ్యి వేసి, అందులో తగినన్ని మిరియాలు లేదా మిరపకాయలు, తాలింపు గింజల్ని వేగించి మెత్తగా నూరి, దాంట్లో ఉప్పు, దబ్బ రసం కలపాలి! ఈ దబ్బకారం లేదా దబ్బ పచ్చడి కమ్మగా ఉంటుంది. తొనలో ఉండే ముత్యాలను నలిపేయకుండా అలానే కలిపితే కంటికింపుగా ఉంటాయి. గోదావరి జిల్లాల్లో టిఫిన్లలోకి నంజుడుగా తింటారు దీన్ని. వేసవి కాలంలో దబ్బ ఎక్కువగా దొరుగుతుంది. దొరికి నంత కాలం తాజాగా దబ్బకారంచేసుకోవచ్చు!


దబ్బ పండును వానాకాలంలో సైంధవ లవణంతోనూ, వసంత కాలంలో పంచదారతోనూ, చలికాలంలో ఉప్పు, అల్లం, ఇంగువతోనూ, వేసవి కాలంలో బెల్లంతోనూ కలిపి తీసుకోవాలని ‘క్షేమకుతూహలం’ పాకశాస్త్ర గ్రంథం పేర్కొంది దబ్బపండు శాకినీ డాకినీల్లాంటి రోగాల్ని జయిస్తుందంటాడు క్షేమశర్మ. శాకినీ డాకినీ అనేవి వైరస్‌లకు మన ప్రాచీన వైద్యగ్రంథాల్లో పేర్లు. ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుందనేది సారాంశం!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అంబరాన్ని అంటిన సంబరాలు..

ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..

Read Latest Telangana News and National News

Updated Date - May 10 , 2026 | 12:36 PM