Share News

పర్యాటక హబ్‌గా కైలాసగిరి

ABN , Publish Date - May 10 , 2026 | 06:33 AM

విశాఖపట్నంలో కైలాసగిరిని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని, అందుకుగాను ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.

పర్యాటక హబ్‌గా కైలాసగిరి

  • ‘త్రిశూలం’ ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణ

విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో కైలాసగిరిని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని, అందుకుగాను ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. కైలాసగిరిపై రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 65 అడుగుల ఎత్తైన త్రిశూలం, ఢమరుకాలను శనివారం ఉదయం ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీలు శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనివల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. విశాఖలో ఈ త్రిశూలం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుందని తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో త్రిశూలం ప్రాజెక్టును పూర్తిచేసిన వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ కృషిని అభినందించారు. కైలాసగిరి అభివృద్ధికి ప్రత్యేకమైన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నామని ఎంపీ శ్రీభరత్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేశ్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, బండారు సత్యనారాయణమూర్తి, లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, కమిషనర్‌ తేజ్‌భరత్‌, సీఈ వినయకుమార్‌, సీఏఓ హరిప్రసాద్‌, బ్రహ్మకుమారీలు, అన్నమయ్య ట్రస్ట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2026 | 06:34 AM