Share News

శనగల మసాలా కూర

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:51 AM

‘చణ’ అంటే ఇవ్వబడినదని! శ్రావణ మాసంలో ముత్తైదువలు ‘‘ఇస్తినమ్మా వాయనం .. పుచ్చుకొంటినమ్మా వాయనం’’ అంటూ శనగలు, పండ్లు, భక్ష్యాలు ఒక పళ్లెంలో పెట్టి ఇచ్చిపుచ్చుకోవటం మన సంప్రదాయం.

శనగల మసాలా కూర
Spicy Chickpea Masala Curry Recipe

‘చణ’ అంటే ఇవ్వబడినదని! శ్రావణ మాసంలో ముత్తైదువలు ‘‘ఇస్తినమ్మా వాయనం .. పుచ్చుకొంటినమ్మా వాయనం’’ అంటూ శనగలు, పండ్లు, భక్ష్యాలు ఒక పళ్లెంలో పెట్టి ఇచ్చిపుచ్చుకోవటం మన సంప్రదాయం. అందువల్ల శనగలు ఇచ్చిపుచ్చుకునే సంస్కృతికి, మానవ సంబంధాలకు ప్రతీకలు!

తెలుగు నేలపై శనగలను వేల సంవత్సరాలుగా పండిస్తున్నప్పటికీ, ప్రధాన ఆహార ధాన్యంగా వాటికి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. ఆయుర్వేద గ్రంథాలు శనగ ఆకులు, పచ్చిశనగలు, ఎండుశనగల ఔషధ గుణాలను ప్రశంసించినా, మన పూర్వులు శనగపప్పు, శనగపిండిని విస్తృతంగా ఉపయో గించిన దాఖలాలు తక్కువ. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బెంగాల్‌తో ఏర్పడిన సాంస్కృతిక పరిచయాల వల్ల శనగపిండి, పుట్నాలపప్పు తెలుగు వంటింట్లో ప్రముఖస్థానం సంపాదించాయి.


దేశవాళీ ఎర్రశనగలు పోషక విలువల్లో ముందుంటాయి. వీటిలో మాంసకృత్తులు, పీచు పదార్థం, ఇనుము, ఫోలేట్‌ సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడ తాయి. అయితే జీర్ణశక్తి బలహీనంగా ఉన్న వారికి శనగలు వాతం, కడుపుబ్బరం, మల బద్ధకం కలిగించవచ్చు. అందుకే వాటిని బాగా నానబెట్టి, ఉడికించి, అల్లం, జీలకర్ర, ఇంగువ వంటి దీపన ద్రవ్యాలతో వండటం మంచిది.

తెల్లగా, గుండ్రంగా ఉండే కాబూలీ లేదా బొంబాయి శనగలు వచ్చాక మన శనగ సంస్కృతి దెబ్బతినటం మొదలయ్యింది. వీటిలో రుచి, పీచు పదార్థం, ఆరోగ్య విలువలు తక్కువ. పైగా, పురుషత్వాన్ని తగ్గిస్తాయనే అపప్రథకూడా ఉంది.


మన తెలుగు వంటల్లో మొలకెత్తిన ఎర్రశనగలను జీలకర్ర, కొబ్బరి తురుము, మిరియాలపొడి, ఉల్లి, టమాటా, పచ్చిమిర్చిలతో సాతాళించిన శనగల కూర విశిష్టమైన వంటకం. అన్నంతోనో, రొట్టెలతోనో, లేక విడిగా స్నాక్స్‌లాగా కూడా తినడానికి అనువు.

పంజాబీ చోళే: పంజాబీలకు శనగలతో తయారయ్యే చోళే ప్రముఖ వంటకం. శనగలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పైన తోలుని తీసేసి, గింజ మెత్తపడేదాకా ఉడికిస్తారు. తరువాత నూనెలో జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి ముద్ద, టమాటా, పచ్చిమిర్చి వేగించి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వగైరా కలిపి, ఉడికిన శనగలను కూడావేసి మగ్గనిస్తారు. చివరగా కొత్తిమీర చల్లితే సుగంధభరిత శనగల


మసాలాకూర తయారు!

సంప్రదాయ పంజాబీ రుచికోసం కొందరు శనగలు ఉడికేటప్పుడు టీ ఆకులను గుడ్డలో కట్టి లేదా టీ బ్యాగ్‌ను వేస్తారు. దీనివల్ల చోళేకు ముదురు గోధుమరంగు, ప్రత్యేకమైన సువాసన వస్తాయి.

చోళేకు ప్రాణసఖి భటూరే!

భటూరా అంటే పులిసిన మైదా రొట్టె. మైదాపిండిని పెరుగు, కొన్నిసార్లు ఈస్ట్‌ లేదా బేకింగ్‌ సోడాతో పులియబెట్టి, గుండ్రంగా మందంగా ఒత్తి నూనెలో వేగిస్తారు. అది బంతిలా పొంగి, బయట పలుచని పొరతో, లోపల మెత్తని స్పాంజిలాంటి స్వభావాన్ని పొందుతుంది. భటూరే అనేది దాని బహువచనం. దీన్ని పరోటాలాగా పొరలమీద వత్తి పెనం మీదా కాల్చి కూడా చేసుకోవచ్చు.


ఈ భటూరేలను వేడి వేడి చోళేతో తినడం పంజాబీ వంటకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన కలయిక. తెలుగువారు ఇడ్లీని సాంబారుతో, దోసెను పల్లిచట్నీతో తిన్నట్లే పంజాబీలు భటూరేను చోళేతో ఆస్వాదిస్తారు. చోళేనీ, భటూరేనీ ఒకే వంటకంగా ప్రజాదరణ పొందేలా చేసిన ఘనత పంజాబీలదే. ఢిల్లీలోని పంజాబీలు దీనికి ప్రసిద్ధి తెచ్చారు.

పంజాబీ చోళే కోసం కాబూలీ శనగలనే ఉత్తరాదివారు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదే మసాలా కూరను మన దేశీ ఎర్రశనగలతో వండితే మరింత గాఢమైన రుచి, ఎక్కువ పోషక విలువలు లభిస్తాయి. చోళే మసాలాకూరకు మన దేశీ శనగలే మేలన్నది చెప్పదగిన సూచన!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించాలి

కోట్లు కొల్లగొట్టిన ఆ దంపతులు అదుపులో?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 11:51 AM