వంటలు: రుచిలో బహుచక్కని చుక్కకూర
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:32 AM
మొక్కపేరే చుక్క! ఎంత చక్కని పేరు! బచ్చలి లాగానే చుక్క ఆకుల్లో జిగురు ఉంటుంది. అందుకని, ‘పుల్లబచ్చలి’ అనటం కూడా ఉంది! పుల్లగోంగూర, ఖట్టీపాలక్ అనీ, సంస్కృతంలో చుక్ర అనీ పిలుస్తారు. యూరోపియన్లు గ్రీన్ సోరెల్ అంటారు.
మొక్కపేరే చుక్క! ఎంత చక్కని పేరు! బచ్చలి లాగానే చుక్క ఆకుల్లో జిగురు ఉంటుంది. అందుకని, ‘పుల్లబచ్చలి’ అనటం కూడా ఉంది! పుల్లగోంగూర, ఖట్టీపాలక్ అనీ, సంస్కృతంలో చుక్ర అనీ పిలుస్తారు. యూరోపియన్లు గ్రీన్ సోరెల్ అంటారు.
చుక్కకూర పేగులకు బలాన్నిచ్చి జీర్ణశక్తిని పెంచుతుంది. నోటికి రుచిని పుట్టిస్తుంది.తేలిగ్గా అరుగుతుంది కఫదోషాల్ని, వాత వ్యాధుల్ని పోగొడ్తుంది. చింతపండు, ఆమ్‌చ్యూర్ లాంటి పులుపు పదార్థాలతో పోలిస్తే, ఆహార పదార్థాల తయారీలో చుక్కకూరని ఎంచుకోవటమేమేలు. అదనంగా పురుషుల్లో జీవకణాలను పెంచు తుంది. లైంగికశక్తిని కూడా పెంపు చేస్తుంది. అలాగని, అదే పనిగా తినకూడదు. వేడిచేస్తుంది. వేడి పెరిగితే జీవకణాలు
నశించిపోతాయి.
విరేచనం అయ్యేలా చేస్తుంది. జిగురు విరేచనాలు, అజీర్తి విరేచనాల్ని తగ్గిస్తుంది. నోరు తడారినట్టుగా ఉండి, నాలుక రుచితెలియని వారికి ఇది మంచిది. పేగుల్ని శుభ్రం చేస్తుంది. జీర్ణక్రియను పెంపు చేస్తుంది. కామెర్లలాంటి లివర్‌వ్యాధుల్లో కూడా భయపడకుండా వాడదగినది. దీర్ఘవ్యాధులు ఏవైనా ఉన్నా చుక్కకూరకి విరోధం ఉండదు. రక్త శుద్ధిని, రక్తవృద్ధిని కూడా కలిగిస్తుంది. గుండెకు, ఊపిరితిత్తులకు బలాన్నిస్తుంది.
చుక్కకూరతో కూర, పప్పు, పులుసు, పచ్చడి అన్నీ చేసుకోవచ్చు. పాలకూర, తోటకూర, మెంతికూర, ములగాకులు, పొన్నగంటి కూర, గలిజేరు లాంటి ఆకుకూరల్ని చుక్కకూరతో కలిపి వండుకుంటే రుచికరంగా ఉంటాయి. చుక్కకూర, తోటకూర పచ్చడి తెలుగువారి ప్రత్యేక వంటకం. చుక్కకూర పచ్చడి గోంగూర పచ్చడిని తలపిస్తుంది. చుక్కకూర రైసు కూడా చేస్తారు. మరికొన్ని వంటకాల్ని చూద్దాం.
చుక్కకూర సాస్: 2 కప్పులు తరిగిన చుక్కకూర, ఒక కప్పు తరిగిన పాలకూర లేదా మీకిష్టమైన ఆకుకూర, వెల్లుల్లి ముక్కలు, ఉల్లి ముక్కలు, జీడిపప్పు ఇంకా ఇతర డ్రైనట్స్ తురుము, తగినంత ఉప్పు మిరియాల పొడి, కొద్దిగా నూనె వేసి మిక్సీ పట్టిన ఈ‘సాస్‘ని విదేశీయులు ‘సోరెల్ గ్రీన్ సాస్’ అంటారు. కొంచెం పలుచగా ఉండే పచ్చడి లాంటిది సాస్. మాంసాహారంతో పుల్కాలతో నంజుకోటానికి, అన్నంలో తింటానిక్కూడా అనుకూలంగా ఉంటుంది.
చుక్కాకుల చారు: చుక్కకూరని సన్నగా తరిగి మెత్తగా మిక్సీపట్టి నీళ్ళలోవేసి కరిగించి ఆ నీళ్లలో రసం (చారు) పొడి కలిపి బాగా మరగకాచి తాలింపు పెట్టిన చారు రుచికరం. ఆరోగ్యదాయకం.
చుక్కకూర సూపు: చుక్కకూరని సన్నగా తరిగి పైన కొద్దిగా నెయ్యి లేదా వెన్న వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బంగాళా దుంపల ముక్కల్ని కొద్దిగా నూనె వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. మీ కిష్టమైన కూరగాయ ముక్కలను మిక్సీ పట్టి పలుచని జ్యూసు తీసి అందులో చారు(రసం)పొడి వేసి చారు కాయాలి. ఈ చారులో ఆలు ముక్కలు, చుక్కకూర గుజ్జు, తగినంత ఉప్పు, మిరియాల పొడి కలిపి చిక్కబడేదాకా కాచినది చుక్కకూర సూపు. పూర్తి ఫైబర్ నిండిన సూపు ఇది.
కంద, చుక్కాకు కూర: కంద-బచ్చలి కూరలా గానే దీన్నీ వండుతారు. కంద, చుక్కకూర ముక్కలుగా తరిగి వేరువేరుగా ఉడికించి, ఒక భాండీలో నెయ్యివేసి తాలింపు గింజలు వేగించి అందులో వీటిని కలిపి మగ్గబెట్టిన కూర రుచికరంగా ఉంటుంది. కావాలంటే, కూర చల్లారాక పావు చెంచా ఆవపిండిని కలిపి 2 గంటలపాటు కదల్చకుండా ఉంచి తినొచ్చు.
చుక్కాకులు వంకాయ కూర: ‘వృంతకేన సహిత’- వంకాయతో కలిపి చుక్కకూరని వండుకోవాలని క్షేమకుతూహలం అనే పాక శాస్త్ర గ్రంథం పేర్కొంది. ఈ కూరకు వెల్లుల్లి కన్నా అల్లం ప్రాణప్రదం.
క్యాల్షియం ఆగ్జలేట్స్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినవాళ్లు, పులుపు తినకూడని పేగుపూత లాంటి వ్యాధుల్తో బాధ పడేవాళ్లు తప్ప అందరూ తినదగినది
డా. జి.వి. పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News