కెనడాలో కాల్పులు.. భారత సంతతి దంపతుల హత్య
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:00 AM
కెనడాలోని సర్రే నగరంలో కాల్పులు కలకలం రేపాయి. సర్రే సిటీలో వాల్‌మార్ట్ స్టోర్ బయట పార్కింగ్ స్థలంలో భారత సంతతికి చెందిన దంపతులను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనను టార్గెటెడ్ కిల్లింగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని సర్రే నగరంలో కాల్పులు కలకలం రేపాయి. సర్రే సిటీలో వాల్‌మార్ట్ స్టోర్ బయట పార్కింగ్ స్థలంలో భారత సంతతికి చెందిన దంపతులను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనను టార్గెటెడ్ కిల్లింగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను గగన్‌ప్రీత్ రేహల్ అలియాస్ గ్యారీ (23) సుఖ్‌జీత్ కౌర్ (24) గా గుర్తించారు. ఈనెల 15న రాత్రి 10.38 గంటల సమయంలో పార్కింగ్ ప్రదేశంలోవారు గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించగా.. కొద్దిసేపటికే ఇద్దరూ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతులిద్దరూ సర్రే సమీపంలోని డెల్టా పట్టణంలో నివసిస్తున్నట్లు సర్రే పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును కెనడాలోని ప్రముఖ హత్య కేసుల దర్యాప్తు విభాగమైన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్‌ఐటీ) కి అప్పగించారు. కాగా.. రేహల్‌పై గతంలో ఆయుధాలకు సంబంధించిన నేరాల కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాల్పుల ఘటన జరిగిన 13 నిమిషాల తర్వాత సమీపంలో మరో కారు దగ్ధమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దగ్ధమైన కారే నిందితులు ఉపయోగించిన వాహనం అయి ఉండవచ్చని ఐహెచ్‌ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. హత్యలు లక్ష్యంగా చేసుకుని జరిగినవేనని, వ్యవస్థీకృత నేర ముఠాలతో సంబంధం ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోయాయని దర్యాప్తు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించి ఏవైనా వివరాలు తెలిసినవారు, సీసీటీవీ లేదా డాష్‌క్యామ్ ఫుటేజీ ఉన్నవారు తమను సంప్రదించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా.. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని లాంగ్లీ ప్రాంతంలో దగ్ధమవుతున్న కారులో 25 ఏళ్ల భారతీయ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని సర్రేలో నివసించే తుషార్ శర్మగా పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక