Share News

ఫ్లైట్ ఎక్కుతుండగా ఇద్దరు ప్రయాణికుల అరెస్టు.. సియాటెల్ విమానాశ్రయంలో ఘటన

ABN , Publish Date - Nov 22 , 2026 | 10:14 AM

అమెరికాలోని సియాటెల్‌ టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులు జెట్‌ బ్రిడ్జిపై వేచి ఉండగా.. ముసుగులు ధరించిన అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఫ్లైట్ ఎక్కుతుండగా ఇద్దరు ప్రయాణికుల అరెస్టు.. సియాటెల్ విమానాశ్రయంలో ఘటన

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని సియాటెల్‌ టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులు జెట్‌ బ్రిడ్జిపై వేచి ఉండగా.. ముసుగులు ధరించిన అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు, విమాన సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలాగే విమానం రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. లాస్‌ఏంజెలెస్‌కు వెళ్లాల్సిన అలాస్కా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 8.10 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఆలస్యమైనట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ సమాచారం వెల్లడించింది. అధికారులు సాధారణ దుస్తుల్లో, గుర్తింపు చిహ్నాలులేని జాకెట్లు, ఖాకీ ప్యాంట్లు ధరించి వచ్చారు. వారు ఓ వ్యక్తిని నేలపైకి తోసి ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన కుమార్తెను తీసుకెళ్తున్నారని, ఆమెకు చెల్లుబాటయ్యే వర్క్‌ పర్మిట్‌ ఉందని ఓ మహిళ కేకలు వేయడం వీడియోలో కనిపించింది.


వీసా గడువు ముగిసినా అమెరికాలోనే..

మెక్సికోకు చెందిన రికార్డో లరాండో మెన్డోజా అనే వ్యక్తిని అరెస్టు చేశామని ఐసీఈ అధికారులు వెల్లడించారు. తన వీసా గడువు ముగిసినా ఆయన అమెరికాలోనే ఉంటున్నారని, ఇమిగ్రేషన్‌ చట్టాలను ఉల్లంఘించినందున అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ మహిళ తమ అధికారులపై వేడి కాఫీ విసిరిందని ఆరోపించారు. ఆమెను సోఫియా హెర్నాండెజ్‌ మెజియాగా గుర్తించామని, ఆమె కూడా మెక్సికోకు చెందిన వ్యక్తేనని, వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించామని చెప్పారు. ఫెడరల్‌ అధికారిపై దాడి చేసిన ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఐసీఈ వెల్లడించింది. కాగా.. వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలో కొనసాగుతున్న వారిపై విమానాశ్రయాల్లో ఐసీఈ అధికారులు ఇటీవలి కాలంలో అరెస్టులు ముమ్మరం చేశారు.


ముందస్తు సమాచారం ఇవ్వలేదు: అలాస్కా ఎయిర్‌లైన్స్‌

ఈ ఘటనపై అలాస్కా ఎయిర్‌లైన్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఐసీఈ అధికారులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విమానం బోర్డింగ్‌ సమయంలో ఆ ప్రయాణికులను అరెస్టు చేశారని తెలిపింది. థ్యాంక్స్‌గివింగ్‌ సెలవుల నేపథ్యంలో విమానాశ్రయంలో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రయాణికులు, ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొంది. బాధిత ప్రయాణికులు, సిబ్బంది ఎదుర్కొన్న ఆందోళనను గుర్తించామని, ప్రతి ప్రయాణికుడితో మర్యాదగా వ్యవహరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఆ అరెస్టులు బాధిత కుటుంబానికే కాకుండా అక్కడున్న ఇతర ప్రయాణికులకు కూడా తీవ్ర ఆందోళన కలిగించాయని పోర్ట్‌ ఆఫ్‌ సియాటెల్‌ పేర్కొంది. అసలేం జరిగిందనే విషయంపై ఫెడరల్‌ అధికారులతో మాట్లాడతామని వెల్లడించింది.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 10:14 AM