Share News

మా దాడిలో ఎఫ్-16 ఫైటర్ జెట్ దెబ్బతిన్నది: ఇరాన్

ABN , Publish Date - Nov 21 , 2026 | 09:23 PM

అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం తమ దాడిలో దెబ్బతిన్నదని ఇరాన్ తాజాగా ప్రకటించింది.

మా దాడిలో ఎఫ్-16 ఫైటర్ జెట్ దెబ్బతిన్నది: ఇరాన్
Iran Claims to have shot US F-16

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం తమ దాడిలో దెబ్బతిన్నదని ఇరాన్ తాజాగా ప్రకటించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థ నుంచి ప్రయోగించిన మిసైల్‌ అమెరికా విమానాన్ని దెబ్బతీసిందని తెలిపింది. ఈ క్రమంలో పైలట్ సమీపంలోని ఓ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా దిగాల్చి వచ్చిందని పేర్కొంది. శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగినట్టు సమాచారం.


తాము దేశీయంగా అభివృద్ధి చేసుకున్న గగనతల రక్షణ వ్యవస్థతో అమెరికా విమానాన్ని దెబ్బతీశామని శనివారం ఇరాన్ మిలిటరీ వెల్లడించింది. ఫైటర్ జెట్ సమీపంలో మిసైల్ పేలడంతో విమానం దెబ్బతిన్నదని వివరించింది. దీంతో, మరో దారిలేక పైలట్ విమానాన్ని సమీపంలోని ఓ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. అయితే, ఆ వైమానిక స్థావరం ఏదనేది మాత్రం ఇరాన్ వెల్లడించలేదు. అయితే, ఇరాన్ ప్రకటనలను అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. తమ విమానాలన్నీ సేఫ్‌గానే ఉన్నాయని స్పష్టం చేసింది.


ఇరాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక దళం ఐఆర్‌జీసీ మరో ప్రకటననూ విడుదల చేసింది. అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చేశామని తెలిపింది. హార్ముజ్ జలసంధి గగనతలంలో దాన్ని కూల్చేశామని చెప్పింది.

ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 21 , 2026 | 09:23 PM