భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక
ABN , Publish Date - Nov 21 , 2026 | 07:57 PM
భారత్ అభివృద్ధిని, అంతర్జాతీయంగా భారత ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు చైనా వ్యూహాలను అమలు చేస్తోందని అమెరికా కాంగ్రెషనల్ కమిటీ హెచ్చరించింది. భారత్‌కు కీలకమైన పారిశ్రామిక ముడిపదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం సరఫరాపై ఆంక్షలు విధించడంతోపాటు సరిహద్దుల్లో సైనిక ఒత్తిడి పెంచుతోందని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ అభివృద్ధిని, అంతర్జాతీయంగా భారత ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు చైనా వ్యూహాలను అమలు చేస్తోందని అమెరికా కాంగ్రెషనల్ కమిటీ హెచ్చరించింది. భారత్‌కు కీలకమైన పారిశ్రామిక ముడిపదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం సరఫరాపై ఆంక్షలు విధించడంతోపాటు సరిహద్దుల్లో సైనిక ఒత్తిడి పెంచుతోందని పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్‌తో సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ భారత్‌పై రెండు వైపుల నుంచి ముప్పు పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ 2026 వార్షిక నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. ‘చైనాస్ అదర్ ఫ్రంట్: ఇండియా అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ యూఎస్ స్ట్రాటజీ ఇన్ ది ఇండో-పసిఫిక్’ పేరుతో ఈ నివేదికను రూపొందించింది. చైనాతో పోటీపడగల స్థాయిలో ఉన్న అమెరికా కూటమిలో సభ్యత్వంలేని అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని కమిటీ పేర్కొంది. చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ సరఫరా, తయారీ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడింది. ఈ విషయం చైనాకు కూడా తెలుసని, అందుకే వివిధ రంగాల్లో భారత్ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని హెచ్చరించింది.
ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి
భారత్‌ను కట్టడి చేసేందుకు చైనా ప్రయోగిస్తున్న ప్రధాన అస్త్రం ఆర్థిక ఒత్తిడేనని అమెరికా కమిటీ అభిప్రాయపడింది. కీలక పారిశ్రామిక ముడిపదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సేవలపై తనకున్న నియంత్రణను ఉపయోగించుకుంటోందని పేర్కొంది. భారత్ సొంతంగా పోటీ ఇచ్చే పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచుకోకుండా అడ్డుకునేలా కీలక ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధిస్తోందని తెలిపింది.
పాక్‌కు చైనా అండ
పాకిస్థాన్‌తో చైనా సైనిక భాగస్వామ్యం మరింత బలపడుతుండడంపైనా అమెరికా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నిరుడు ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాక్ మధ్య తలెత్తిన ఘర్షణలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. పాకిస్థాన్‌కు చైనా అందిస్తున్న దీర్ఘకాలిక మద్దతు, పెరుగుతున్న సైనిక శక్తి భారత్‌కు రెండు వైపుల నుంచీ ముప్పును పెంచుతున్నాయని పేర్కొంది. 2025 మేలో జరిగిన ఘర్షణల సందర్భంగా చైనా నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా పాకిస్థాన్‌కు సహకారం అందించినట్లు తెలిసిందని నివేదిక పేర్కొంది. ఆ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారం అందించినట్లు చైనా ఈ ఏడాది తొలిసారిగా అంగీకరించిందని నివేదిక తెలిపింది.
భారత్-అమెరికా సమన్వయానికి పిలుపు
చైనా ప్రాంతీయ ఆధిపత్య వ్యూహాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో అమెరికా రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలని కాంగ్రెషనల్ కమిటీ సూచించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్రగర్భ, సముద్ర కార్యకలాపాలపై నిఘా సామర్థ్యాలను పెంచుకునేందుకు ఇరు దేశాల రక్షణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొంది. కేవలం సైనిక విన్యాసాలకే పరిమితం కాకుండా, నిరంతరం సహకారాన్ని పెంచుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలను ఉమ్మడిగా పర్యవేక్షించడం, సముద్ర భద్రతా ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది.
ఇవి కూడా చదవండి..
ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం
ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు