Share News

ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:41 PM

ప్రైవేటు వాహనాలపై కులాన్ని సూచించే పేర్లు, గుర్తులు, అంకెలు వంటివి ప్రదర్శించడాన్ని గుజరాత్‌ ప్రభుత్వం నిషేధించింది. టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనాలతో పాటు బస్సులు, లారీలకూ ఈ నిబంధన వర్తించనుంది.

ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం

ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేటు వాహనాలపై కులాన్ని సూచించే పేర్లు, గుర్తులు, అంకెలు వంటివి ప్రదర్శించడాన్ని గుజరాత్‌ ప్రభుత్వం నిషేధించింది. టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనాలతో పాటు బస్సులు, లారీలకూ ఈ నిబంధన వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఓడరేవులు, రవాణా శాఖ ఈనెల 17న గుజరాత్‌ మోటారు వాహనాల (మూడో సవరణ) నిబంధనలు-2026ను నోటిఫై చేసింది. 1989 నాటి గుజరాత్‌ మోటారు వాహనాల నిబంధనల్లోని 125(1)వ నిబంధనను సవరించింది. గతంలో ఉన్న ‘ప్రకటన పరికరాలు, బొమ్మలు’ అనే పదాలకు బదులుగా ‘ప్రకటన పరికరాలు, కుల సూచికలు, బొమ్మలు’ అని చేర్చింది.


అలాగే 138(2)వ నిబంధన తర్వాత కొత్తగా 3వ సబ్ రూల్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అనుమతించిన సందర్భాలు మినహా ప్రైవేటు వాహనాలపై ఎలాంటి ప్రకటనలు, కులానికి సంబంధించిన గుర్తులు, బొమ్మలు, ఇతర రాతలను ప్రదర్శించకూడదు. ఈ నిబంధనలతో వాహనాలపై కులాన్ని సూచించే పదాలు, చిహ్నాల ప్రదర్శన కూడా మోటారు వాహన చట్ట పరిధిలోకి వచ్చింది. ఈ సవరణలకు సంబంధించి ప్రభుత్వం తొలుత ఈ ఏడాది జూన్‌ 11న ముసాయిదా నిబంధనలను అసాధారణ గెజిట్‌లో ప్రచురించింది. వాటిపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. అయితే ఆ సమయంలోపు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు అందలేదు. దీంతో నవంబరు 17న తుది నిబంధనలను నోటిఫై చేస్తూ సవరణలను అమల్లోకి తెచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 20 , 2026 | 06:10 PM