ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:49 PM
ఇరాన్ అణు కేంద్రాలపై 2025 జూన్‌లో అమెరికా జరిపిన సైనిక దాడి 'ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్' సంబంధించిన సంచలన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ దాడిలో పాల్గొన్న బీ-2 స్టెల్త్ బాంబర్ విమానాల పైలట్లు తొలిసారిగా తమ అనుభవాలను వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ అణు కేంద్రాలపై 2025 జూన్‌లో అమెరికా జరిపిన సైనిక దాడి 'ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్' సంబంధించిన సంచలన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ దాడిలో పాల్గొన్న బీ-2 స్టెల్త్ బాంబర్ విమానాల పైలట్లు తొలిసారిగా తమ అనుభవాలను వెల్లడించారు. దాదాపు 15 ఏళ్లపాటు సాగిన ప్రణాళిక, శత్రుదేశానికి తెలియకుండా చేపట్టిన రహస్య ప్రయాణం, చివరి నిమిషంలో మారిన దాడి వ్యూహం.. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను వివరించారు. అమెరికా సైనిక పత్రిక 'ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్' ఈ కథనాన్ని ప్రచురించింది (Operation Midnight Hammer).
ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై దాడికి సంబంధించిన ప్రణాళిక 2009లోనే ప్రారంభమైందని కథనం వెల్లడించింది. టెహ్రాన్‌కు నైరుతి దిశలోని పర్వత ప్రాంతాల్లో అనుమానాస్పద నిర్మాణాలను అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ తర్వాత సుమారు 15 ఏళ్లపాటు ఆ కేంద్ర నిర్మాణం, విద్యుత్ వ్యవస్థలు, గాలి ప్రసరణ మార్గాలు, భూగర్భ గదులపై అధ్యయనం చేశారు. భూమి లోతుల్లో, పర్వతాల కింద నిర్మించిన రక్షణ కేంద్రాలను ఛేదించేలా జీబీయూ-57 (GBU-57 Bunker Buster) భారీ బంకర్ బస్టర్ బాంబును రూపొందించారు.

దాడికి కొన్ని రోజుల ముందు ఫోర్డో కేంద్రంలోని గాలి ప్రసరణ మార్గాలను ఇరాన్ కాంక్రీటుతో మూసివేసేందుకు ప్రయత్నించినట్లు అమెరికా గుర్తించిందని కథనం పేర్కొంది (Iran Nuclear Facilities). దీంతో ముందుగా ఆ కాంక్రీటు పొరను ఛేదించి, ఆ తర్వాత భూగర్భ కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేలా దాడి క్రమాన్ని మార్చాల్సి వచ్చింది. దాడికి కేవలం 16 గంటల ముందే తమ ప్రణాళికకు ఆమోదం లభించిందని పైలట్లు చెప్పారు. ఆ తర్వాత దాదాపు 37 గంటలపాటు వారి ప్రయాణం సాగింది. మధ్యలో గగనతలంలోనే ఇంధనం నింపుకున్నారు. 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో కొద్దిసేపు నిద్రపోతూ ప్రయాణాన్ని కొనసాగించారు.
దాడి సమయంలో అమెరికా బీ-2 బాంబర్ (B-2 Bomber) విమానాలు సుమారు 18 గంటలపాటు ప్రయాణించి ఇరాన్ గగనతలానికి చేరుకున్నాయి. లక్ష్యానికి సమీపంలోకి వచ్చినప్పుడు టెహ్రాన్ నగర దీపాలు కనిపించాయి. దీంతో ఒక పైలట్ ఆశ్చర్యంతో 'ఓ మై గాడ్.. ఇది టెహ్రాన్!' అంటూ స్పందించాడు. లక్ష్యాలను చేరుకున్న తర్వాత విమానాల్లోని బాంబుల ద్వారాలు తెరుచుకున్నాయి. ఒక్కొక్కటి సుమారు 30 వేల పౌండ్ల బరువున్న భారీ బంకర్ బస్టర్ బాంబులను ఫోర్డో అణు కేంద్రం లక్ష్యంగా విడుదల చేశారు. బాంబులు విమానం నుంచి విడిపోయిన తర్వాత పైలట్లకు విమానాన్ని నియంత్రించడం కొంత సులభమైంది. బాంబులు లక్ష్యాన్ని తాకాయా లేదా అన్న ఉత్కంఠతో పైలట్లు వెనక్కి తిరిగి చూశారు. కొన్ని సెకన్ల తర్వాత కొండల మధ్య భారీ అగ్నిగోళం కనిపించింది (Fordow Nuclear Site).
అమెరికా పంపిన ఏడు బీ-2 విమానాల్లో ఆరు ఫోర్డో అణు కేంద్రాన్ని, మరో విమానం నతాంజ్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.10 గంటలకు ఫోర్డోపై బాంబుల దాడి ప్రారంభమైంది. దాడి పూర్తయిన తర్వాత అమెరికా బాంబర్ విమానాలు ఇరాన్ గగనతలాన్ని వీడి వెనక్కి ప్రయాణించాయి. సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత పైలట్లు తమ స్థావరానికి సందేశం పంపారు. 'మిషన్ పూర్తయింది.. మేము సురక్షితంగా ఉన్నాం' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్
బంగ్లాదేశ్‌లో హింస.. భారత్‌పైనా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆరోపణలు..