Share News

అమెరికాను కదిలించిన భారతీయ వృద్ధురాలు! కాంగ్రెస్‌లో కొత్త బిల్లు

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:16 PM

అమెరికాలో మూడు దశాబ్దాలుగా ఉంటున్న ఓ భారతీయ వృద్ధురాలిని డిపోర్టు చేయడం యావత్ దేశాన్ని కదిలించింది. ఇలాంటి అన్యాయాలు పునరావృతం కాకుండా ఓ కొత్త బిల్లు కాంగ్రెస్ ముందుకొచ్చింది.

అమెరికాను కదిలించిన భారతీయ వృద్ధురాలు! కాంగ్రెస్‌లో కొత్త బిల్లు
Harjit Kaur Deportation

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మూడు దశాబ్దాలుగా ఉంటున్న ఓ భారతీయ వృద్ధురాలిని డిపోర్టు చేయడం యావత్ దేశాన్ని కదిలించింది. ఇంతటి అన్యాయం మరొకరి విషయంలో జరగకూడదని కంకణం కట్టుకున్న నలుగురు కాంగ్రెస్ (అమెరికా చట్టసభలు) సభ్యులు కొత్త బిల్లును తీసుకొచ్చారు. ప్రొటక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్ పేరుతో ఈ బిల్లును కాంగ్రెస్‌మన్ జాన్ జెరామెండీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ప్రతినిధుల సభ సభ్యులు లతీఫా సైమన్, జో లాఫ్‌గ్రెన్, వాన్ వార్గాస్ మద్దతు తెలిపారు.


జరిగింది ఇదీ..

కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో దాదాపు 30 ఏళ్లగా ఉంటున్న హర్జీత్ కౌర్‌ (73), ఇమిగ్రేషన్ శాఖ అధికారులు గతేడాది బలవంతంగా భారత్‌కు పంపించేశారు. ఆమె తన డిస్ట్రిక్ట్‌లోనే దశాబ్దాలుగా ఉంటున్నారని ప్రతినిధుల సభ సభ్యుడు సైమన్ పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేకపోయినా పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమిగ్రేషన్ శాఖ నిబంధనలన్నీ ఆమె తూచా తప్పకుండా పాటించిందని చెప్పారు. అధికారుల సూచన మేరకు హర్జీత్ కౌర్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారి ముందు విచారణకు హాజరయ్యేవారని చెప్పారు. గత 13 ఏళ్లుగా ఆమె క్రమం తప్పకుండా ఇలాగే చేశారని అన్నారు.


కానీ, ట్రంప్ సర్కారు ఆదేశాల నేపథ్యంలో ఇమిగ్రేషన్ అధికారులు కౌర్‌ను అన్యాయంగా, నిర్హేతుకంగా నిర్బంధించి ఆ తరువాత పంపించేశారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో తమకంటూ ఓ జీవితాన్ని నిర్మించుకున్న కౌర్ లాంటి వేల మందిని అన్యాయంగా డిపోర్ట్ చేశారని జెరామెండీ ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ లెక్కల ప్రకారం, డిపోర్టేషన్ ఆదేశాలు ఎదుర్కొంటున్న 1.19 మిలియన్ల మంది ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నారు. ఇప్పటికే వేల మంది అక్కడ సుస్థిర నివాసం ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. అయినప్పటికీ ట్రంప్ సర్కారు కఠిన వైఖరి ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు తుది డిపోర్టేషన్ ఆదేశాల అమలుకు దిగారు.


ఈ నేపథ్యంలో తుది డిపోర్టేషన్ ఆదేశాలు జారీ చేసిన 10 ఏళ్ల కలాపరిమితి తరువాత అవి వాటంతట అవే రద్దైపోయేలా నలుగురు కాంగ్రెస్ సభ్యులు కొత్త బిల్లు తీసుకొచ్చారు. అమెరికా అంతర్గత భద్రతా విభాగం విజ్ఞప్తి మేరకు ఇమిగ్రేషన్ జడ్జ్ ఈ ఆదేశాలను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. అయితే, ఇందుకోసం స్పష్టమైన కారణాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక తుది డిపోర్టేషన్ ఆదేశాల కాలగడువు ముగిశాక విదేశస్తులు చట్టబద్ధంగా అమెరికాలో ఉండేందుకు అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చు.10 ఏళ్ల పాటు నిరంతరంగా అమెరికాలోనే ఉన్న వారికే ఈ అనుమతి లభించేలా బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 20 , 2026 | 04:52 PM