కొడుకు పెళ్లిలో డ్యాన్స్ చేసిన ఛోటా షకీల్ బావ.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:04 PM
గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ బావ సలీం ఫ్రూట్‌వాలా తన కుమారుడి వివాహ వేడుకలో నృత్యం చేశాడు. అతను డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సలీం నృత్యం చేస్తుండగా ఆయనపై కరెన్సీ నోట్లను విసరుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.
ఇంటర్నెట్ డెస్క్: గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ బావ సలీం ఫ్రూట్‌వాలా తన కుమారుడి వివాహ వేడుకలో నృత్యం చేశాడు. అతను డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సలీం నృత్యం చేస్తుండగా ఆయనపై కరెన్సీ నోట్లను విసరుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. కుమారుడు, కుమార్తె వివాహాలకు హాజరయ్యేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం సలీం ఫ్రూట్‌వాలాకు 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. దావూద్ ఇబ్రహీం ముఠాకు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించారన్న ఆరోపణలపై 2022 ఆగస్టు 4న ఎన్‌ఐఏ అధికారులు సలీంను అరెస్టు చేశారు. బెయిల్ షరతుల్లో భాగంగా రూ.లక్ష చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, బెయిల్‌పై ఉన్న కాలంలో 24 గంటల పాటు ఇద్దరు పోలీసు సిబ్బందిని భద్రత కోసం నియమించేందుకు అయ్యే పూర్తి ఖర్చును కూడా ఆయనే భరించాలని స్పష్టం చేసింది. ఆయన కదలికలను నివాసం, వివాహ వేదికకే పరిమితం చేసింది. సాక్షులను సంప్రదించరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఆదేశించింది.
వ్యాపారిని బెదిరించి రూ.30 లక్షలు వసూలు
సలీం ఫ్రూట్‌వాలాపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. బలవంతపు వసూళ్లు, ఆస్తుల కబ్జా, మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకున్నాయి. 2026 ఫిబ్రవరిలో మహారాష్ట్ర సంఘటిత నేరాల నియంత్రణ చట్టం (ఎంసీఓసీఏ) కింద విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయస్థానం మరో వసూళ్ల కేసులో ఆయనను అభియోగాల నుంచి తప్పించేందుకు నిరాకరించింది. విచారణ కొనసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు ఎంసీఓసీఏలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుక అనంతరం రూ.62 లక్షలు ఇవ్వాలంటూ తనను సలీం ఫ్రూట్‌వాలా బెదిరించాడని ఓ వ్యాపారి 2022లో ఫిర్యాదు చేశారు. బెదిరించిన తర్వాత రూ.30 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారును బలవంతంగా తీసుకున్నాడని, అంతేకాకుండా నగదు కూడా బదిలీ చేయించుకున్నారని ఆ వ్యాపారి ఆరోపించారు.
ఈ వార్తలూ చదవండి
ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..
గుబురు గడ్డం.. చేతిలో ఏకే-203.. వైరల్ కమాండోతో మళ్లీ తెరపైకి 9 పారా ఫోర్స్