Share News

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:38 PM

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వెలువరించిన భిన్న తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ప్రత్యేకంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..
Supreme Court

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వెలువరించిన భిన్న తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ప్రత్యేకంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంలోని అన్ని అంశాలను ఇప్పటికే ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనమే పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన ధర్మాసనం స్పష్టతనిచ్చింది. రీకాల్ పిటిషన్‌తో పాటు రిఫరెన్స్ ఉత్తర్వులపై అభ్యంతరాలనూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనమే పరిశీలిస్తుందని తెలిపింది.


కాగా, ఈ కేసులో సెప్టెంబర్ 23న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది. దీనిని రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అదే ధర్మాసనం ముందు విచారించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు. అయితే, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ వచ్చే వారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రీకాల్ పిటిషన్‌ను ప్రస్తుత ధర్మాసనమే విచారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. సంబంధిత న్యాయమూర్తి పదవీ విరమణ చేసినప్పటికీ, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రీకాల్ దరఖాస్తును విచారించేందుకు అధికారం కలిగి ఉంటుందని స్పష్టం చేశారు.


2023లో ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసే కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉండే ఎంపిక కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకానికి సిఫార్సులు చేస్తుంది. గతంలో ఈ ఎంపిక ప్రక్రియలో ప్రధాన న్యాయమూర్తికీ స్థానం ఉండగా.. కొత్త చట్టంలో ఆయనను కమిటీ నుంచి మినహాయించారు. ఈ మార్పు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తుది విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో రీకాల్ పిటిషన్, రిఫరెన్స్ ఉత్తర్వులపై అభ్యంతరాలూ అదే ధర్మాసనం పరిశీలించనుండటంతో ఎన్నికల కమిషనర్ల నియామక విధానానికి సంబంధించిన చట్టపరమైన అంశాలపై తదుపరి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

గుబురు గడ్డం.. చేతిలో ఏకే-203.. వైరల్ కమాండోతో మళ్లీ తెరపైకి 9 పారా ఫోర్స్

ఢిల్లీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ హతం

Updated Date - Nov 20 , 2026 | 12:38 PM