గుబురు గడ్డం.. చేతిలో ఏకే-203.. వైరల్ కమాండోతో మళ్లీ తెరపైకి 9 పారా ఫోర్స్
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:02 PM
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది లతీఫ్ భట్‌ను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యం ఈనెల 18 తెల్లవారుజామున లతీఫ్ భట్‌ను హతమార్చింది. ఈ సందర్భంగా భారత సైన్యానికి చెందిన ఓ కమాండో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ, నవంబర్ 20: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది లతీఫ్ భట్‌ను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యం ఈనెల 18 తెల్లవారుజామున లతీఫ్ భట్‌ను హతమార్చింది. ఈ సందర్భంగా భారత సైన్యానికి చెందిన ఓ కమాండో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుబురు గడ్డం, ఖాకీ దుస్తులు, ఏకే-203 రైఫిల్, మిలిటరీ పరికరాలతో అతడి లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా భారత సైన్యంలోని ప్రతిష్ఠాత్మక దళమైన 9 పారా స్పెషల్ ఫోర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఆపరేషన్లలో పాల్గొనే సైనికుల వివరాలను భారత సైన్యం వెల్లడించరు. అయితే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న బ్యాడ్జి ఆధారంగా ఆ కమాండో 9 పారా స్పెషల్ ఫోర్స్‌కు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దళానికి 'మౌంటెన్ ర్యాట్స్', 'పైరేట్స్', 'ఘోస్ట్ ఆపరేటర్స్' అనే పేర్లూ ఉన్నాయి. కాగా, 9 పారా స్పెషల్ ఫోర్స్ చరిత్ర 1965 భారత్-పాక్ యుద్ధంతో ముడిపడి ఉంది. ఆ సమయంలో శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి మెరుపు దాడులు చేసేందుకు కర్నల్ మేఘ్ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిని తొలుత 'మేఘ్‌దూత్ ఫోర్స్'గా పిలిచేవారు. హాజీ పీర్ ప్రాంతంలో పాక్ స్థావరాలపై ఈ దళం నిర్వహించిన దాడులు సైనిక నాయకత్వాన్ని ఆకట్టుకున్నాయి. దీంతో 1966 జులై 1న తొమ్మిదో పారాచూట్ కమాండో బెటాలియన్ ఏర్పాటైంది.
ఈ దళానికి పర్వత ప్రాంతాల్లో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించడంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది. అందుకే దీనికి 'మౌంటెన్ ర్యాట్స్' అనే పేరు వచ్చింది. చిన్న బృందాలుగా పనిచేస్తూ, తక్కువ మంది సిబ్బందితో గరిష్ఠ ఫలితాలు సాధించడం వీరి ప్రత్యేకత. ఉధంపూర్ కేంద్రంగా పనిచేసే ఈ కమాండోలు జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌తో కలిసి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలోనూ పాల్గొంటారు. 1971 భారత్-పాక్ యుద్ధంలో 'ఆపరేషన్ మంధోల్' ద్వారా పాక్ ఫిరంగులను ధ్వంసం చేసి, 'డిఫెండర్ ఆఫ్ పూంచ్'గా గుర్తింపు పొందారు. శ్రీలంకలో శాంతి పరిరక్షక కార్యకలాపాలతోపాటు, 1999 కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. 2001లో ఆపరేషన్ అపాచీ, 2016 సర్జికల్ స్ట్రైక్స్‌లోనూ ఈ దళం పాత్ర ప్రస్తావనకు వచ్చింది.
అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యేక లక్ష్యాలను సాధించేందుకు 9 పారా కమాండోలకు కఠినమైన శిక్షణ ఇస్తారు. ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన భూభాగాల్లో పనిచేయడంతోపాటు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి అత్యంత నైపుణ్యం ఉంటుంది. అందుకే భారత సైన్యంలో ఈ దళానికి ప్రత్యేక స్థానం ఉంది. లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్ సందర్భంగా వైరల్ అయిన వీడియోతో మరోసారి ఈ దళంపై ఆసక్తి పెరిగింది. అయితే, వీడియోలో కనిపించిన కమాండో గుర్తింపుపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ హతం
గోల్డీ బ్రార్‌పై కెనడా భారీ రివార్డు.. ఆచూకీ తెలిపితే రూ.1.63 కోట్లు..