Share News

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:55 PM

కావేరీ నదీ జలాల పంపిణీ వివాదంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక నుంచి అదనంగా 11 టీఎంసీల నీటిని విడుదల చేయించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..
Cauvery Water Dispute

ఇంటర్నెట్ డెస్క్: కావేరీ నదీ జలాల పంపిణీ వివాదంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక నుంచి అదనంగా 11 టీఎంసీల నీటిని విడుదల చేయించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో నీటి కొరత కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని తమిళనాడు ప్రభుత్వం వాదించినప్పటికీ, అదనపు నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది (Cauvery Water Dispute).


జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. కావేరీ నదిలో తమకు రావాల్సిన నీటి వాటాను కర్ణాటక సక్రమంగా విడుదల చేయడం లేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. జూలై నుంచి తమకు సుమారు 11 టీఎంసీల నీరు బకాయి ఉందని పేర్కొంది. ఈ నీటిని విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని వ్యవసాయ రంగంపై ప్రభావం పడుతోందని, ముఖ్యంగా కావేరీ డెల్టా ప్రాంతంలోని పంటలు దెబ్బతింటున్నాయని కోర్టుకు వివరించింది. కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ, కావేరీ జల నియంత్రణ కమిటీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమకు రావాల్సిన నీరు అందడం లేదని తమిళనాడు వాదించింది (Cauvery Water Sharing).


తమిళనాడు వాదనలను కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకించింది (Tamil Nadu Karnataka Water Dispute). తమ రాష్ట్రంలోని పలు జిల్లాలు కూడా కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని కోర్టుకు తెలిపింది. కావేరీ పరీవాహక ప్రాంతంలోని జలాశయాలకు నీటి రాక గణనీయంగా తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు నీటిని విడుదల చేయాలని ఆదేశించడం సాధ్యం కాదని కర్ణాటక తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం తమిళనాడు పిటిషన్‌ను కొట్టివేసింది.


ఇవి కూడా చదవండి..

గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్

బంగ్లాదేశ్‌లో హింస.. భారత్‌పైనా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆరోపణలు..

Updated Date - Nov 20 , 2026 | 12:59 PM