పుతిన్ ఓ హంతకుడు.. ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్స్కీ కౌంటర్..
ABN , Publish Date - Nov 21 , 2026 | 09:16 AM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్నేహితుడిగా అభివర్ణించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. తమ దేశానికి పుతిన్ శత్రువని, ఆయన ఒక హంతకుడని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్నేహితుడిగా అభివర్ణించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. తమ దేశానికి పుతిన్ శత్రువని, ఆయన ఒక హంతకుడని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు కూడా పుతిన్‌ను హంతకుడిగానే చూస్తారని అన్నారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల నేపథ్యంలో జెలెన్స్కీ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి (Trump Putin Meeting).
పుతిన్‌ను ట్రంప్ తన స్నేహితుడిగా పేర్కొన్న విషయంపై జెలెన్స్కీని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు (Zelensky CNN Interview). దీనికి ఆయన స్పందిస్తూ.. పుతిన్ తమకు శత్రువని, తమ దృష్టిలో ఆయన ఒక హంతకుడని స్పష్టం చేశారు. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు కూడా ఆయనను అలాగే భావిస్తారని పేర్కొన్నారు. ట్రంప్ స్నేహితుడిగా సంబోధించడం వల్ల పుతిన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు రష్యా అధ్యక్షుడికి మరింత ధైర్యాన్ని ఇవ్వవచ్చని, ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగించేందుకు అవకాశం కల్పించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ట్రంప్ వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడుతూ పుతిన్‌తో తనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని పుతిన్ కూడా కోరుకుంటున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే పుతిన్, జెలెన్స్కీ మధ్య పరస్పర విభేదాలు తీవ్రంగా ఉన్నాయని, ఇద్దరూ ఒకరినొకరు ద్వేషిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చెప్పారు (US Russia Relations).
ట్రంప్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల్లో అమెరికా కీలక పాత్ర పోషించగలదని జెలెన్స్కీ పేర్కొన్నారు (Russia Ukraine War). ప్రపంచంలో తమకు లభించగల బలమైన మధ్యవర్తి అమెరికానేనని అన్నారు. పుతిన్ ఇతర దేశాల మాట వినకపోయినా అమెరికా, చైనాల మాట వినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా వద్ద భారీ స్థాయిలో రాజకీయ, ఆర్థిక అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌ను చూసి నేర్చుకోండి.. అమెరికా వడ్డీ రేట్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..