Share News

తాజ్ సందర్శించవచ్చు.. పాక్ మంత్రికి అనుమతి

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:22 PM

ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించేందుకు పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు మాత్రం అనుమతి నిరాకరించింది.

తాజ్ సందర్శించవచ్చు.. పాక్ మంత్రికి అనుమతి

ఇంటర్నెట్ డెస్క్: ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించేందుకు పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు మాత్రం అనుమతి నిరాకరించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) నాగరికతల సంభాషణల వేదిక సదస్సులో పాల్గొనేందుకు మాలిక్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. తాజ్ మహల్‌తో పాటు నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు అంతకుముందు ఆయన అనుమతి కోరగా ప్రభుత్వం నిరాకరించింది. ప్రస్తుతం తాజ్‌ను సందర్శించేందుకు మాత్రమే ఆయనకు అనుమతి ఇచ్చింది. అలాగే హుమాయున్ సమాధి, ఢిల్లీ హాత్‌ సహా ఢిల్లీలోని వివిధ చారిత్రక ప్రాంతాల సందర్శనకూ ఆయనకు క్లియరెన్స్ లభించింది. దీంతో మాలిక్ నేత‌ృత్వంలోని బృందం ఆ ప్రాంతాలను సందర్శించనుంది.


ఒకరికొకరం సందర్శించుకుంటూనే ఉంటాం

గతంలో సింధూ జలాల ఒప్పందంపై కామెంట్లు చేసిన తర్వాత ఎస్‌సీఓ నాగరికతల సంభాషణల సదస్సులో పాల్గొనేందుకు మాలిక్.. భారత్ వచ్చారు. గత మూడేళ్లలో ఒక పాకిస్తానీ మంత్రి మన దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. శుక్రవారం సదస్సు ప్రారంభమైన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. శాంతి, భద్రతను ముందుకు తీసుకెళ్లే విషయంలో చేసే అన్ని ప్రయత్నాలకు పాక్ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. భారత్‌కు ఇక ఫిర్యాదులు ఉండవని, ఇకపై రెండు దేశాల మధ్య పర్యటనలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య మెరుగైన సంబంధాల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా సభ్య దేశాలు పాటుపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం

ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు

Updated Date - Nov 21 , 2026 | 05:22 PM