Share News

రైలు బోగీలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య! నిందితుడిని పట్టించిన బంగారు ఉంగరం

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:45 PM

బంగారు ఉంగరం ఓ హత్య కేసును ఛేదించడంలో కీలక ఆధారంగా మారింది. రైలు బోగీలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో వెలుగుచూసింది.

రైలు బోగీలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య! నిందితుడిని పట్టించిన బంగారు ఉంగరం
Nagercoil Case

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ రైల్వే యార్డులో దారుణ ఘటన వెలుగుచూసింది. ఖాళీగా ఉన్న రైల్వే బోగీలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అయితే.. ఈ కేసులో బాధితురాలి గుర్తింపును తెలుసుకోవడానికి ఆమె వద్ద లభించిన పాము ఆకారంలోని బంగారు ఉంగరం కీలక ఆధారంగా మారింది.

నవంబర్ 13వ తేదీ అర్ధరాత్రి ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే యార్డులో బోగీని శుభ్రం చేస్తుండగా అందులో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె వద్ద గుర్తింపునకు సంబంధించిన ఇతర ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఉంగరంపై ఉన్న హాల్‌మార్క్ వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆ ఉంగరం గుజరాత్‌లో తయారైనట్లు.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారికి సరఫరా చేసినట్లు గుర్తించారు. అక్కడి నుంచి లభించిన వివరాల ఆధారంగా మహిళ పాన్ వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన చిరునామాను పోలీసులు సేకరించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను గుర్తించి విచారించగా.. గత మూడు నెలలుగా ఆమె కనిపించడం లేదని తెలిసింది.


ఆరు గంటల్లోనే నిందితుడి అరెస్ట్.. సీసీటీవీతో కీలక ఆధారాలు..

బాధితురాలి గుర్తింపుతో పాటు నిందితుడిని పట్టుకోవడంలోనూ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. తెల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బోగీ నుంచి బయటకు వస్తున్నట్లు గుర్తించారు. తొలుత ముగ్గురు అనుమానితులపై దృష్టి సారించిన పోలీసులు సీసీటీవీ ఆధారాలతో విచారణను మరింత వేగవంతం చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరిగే వ్యక్తిగా గుర్తించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడి, శారీరకంగా దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడు ధరించిన రక్తపు మరకలున్న చొక్కాను కాలువలో పడేసినట్లు గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన ఆరు గంటల్లోనే అనుమానితుడిని అరెస్టు చేసినట్లు తమిళనాడు రైల్వే డీజీపీ కె. వన్నియా పెరుమాళ్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 21 , 2026 | 05:09 PM