Share News

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ABN , Publish Date - Nov 21 , 2026 | 10:16 AM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ‘కాంప్రమైజ్డ్ పీఎం’ వ్యాఖ్య కొత్త వివాదానికి తెరలేపింది. ఈ వ్యాఖ్యపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు.

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..
Union Minister Kiran Rijiju

న్యూఢిల్లీ, నవంబర్ 21: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ‘కాంప్రమైజ్డ్ పీఎం’ వ్యాఖ్య కొత్త వివాదానికి తెరలేపింది. ఈ వ్యాఖ్యపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి నాలుగు కీలక ప్రశ్నలు సంధించారు. 1962 భారత్-చైనా యుద్ధం నుంచి కాంగ్రెస్ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి వరకు పలు అంశాలను లేవనెత్తారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో కిరణ్ రిజిజు నాలుగు ప్రశ్నలు సంధిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా 1962 భారత్-చైనా యుద్ధం నాటి పరిస్థితులను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రస్తావించారు. ‘1962లో నా గ్రామాన్ని చైనా ఆక్రమించింది. 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణ చెబుతుందా?’ అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ భారతదేశాన్ని పేద దేశంగా ఉంచింది.. ఎందుకు?’ అంటూ మరో ప్రశ్న సంధించారు. ‘భారతదేశాన్ని పాములు ఆడించే వారి దేశమని ఎందుకు పిలిచేవారు?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. ‘భారతదేశ ఆర్థిక వ్యవస్థను హిందూ వృద్ధి రేటు అని ఎందుకు అవమానించారు?’ అని మరో ప్రశ్నను లేవనెత్తారు. ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.


అసలు వివాదం ఎక్కడ మొదలైంది..?

చైనాలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపై సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే భారత ప్రధాని కూడా ఆ సమావేశంలో ఉండేవారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ‘కాంప్రమైజ్డ్ ప్రధాని ఇలాంటి సమావేశంలో ఎప్పటికీ కూర్చోలేరు’ అంటూ ప్రధాని మోదీని విమర్శించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ ఆ పార్టీపై, రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 12 మంది మృతి, 180 మందికి అస్వస్థత

గోప్రో కెమెరాపై చైనా మౌనం.. ఎన్ఐఏ ప్రశ్నలకు స్పందించని డ్రాగన్ దేశ అధికారులు

Updated Date - Nov 21 , 2026 | 10:39 AM