Share News

మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 12 మంది మృతి, 180 మందికి అస్వస్థత

ABN , Publish Date - Nov 21 , 2026 | 07:59 AM

మణిపూర్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం మూడు రోజుల్లోనే 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 180 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.

మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 12 మంది మృతి, 180 మందికి అస్వస్థత
Manipur Liquor Case

ఇంఫాల్‌, నవంబర్ 21: మణిపూర్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం, శుక్రవారం మధ్య కల్తీ మద్యం తాగి 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 180 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. మద్యం తాగిన వారంతా వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, కళ్లు తిరగడం, చూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు. చందేల్‌ జిల్లా చక్ఫికరాంగ్‌ సబ్‌ డివిజన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.


ఈ ఘటనపై మణిపూర్‌ ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్‌ సింగ్‌ స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఆస్పత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇంఫాల్‌ వెస్ట్‌ జిల్లాలోని షిజా హాస్పిటల్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలోని బబీనా ఆస్పత్రులను ఆయన సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. షిజా ఆస్పత్రిలో 140 మందికిపైగా, బబీనా ఆస్పత్రిలో 41 మందికిపైగా చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని అవసరమైన మందులతో సహా చందేల్‌ జిల్లాకు పంపించినట్లు పేర్కొన్నారు.


కాగా, మరణాలకు అసలు కారణం ఏమిటనేది అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదని చందేల్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభావిత ప్రాంతాల్లో స్థానికంగా తయారయ్యే మద్యానికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే, మద్యం సేవించిన తర్వాత వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, తలతిరగడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలని అధికారులు పేర్కొన్నారు. చక్ఫికరాంగ్‌ సబ్‌ డివిజన్‌ ప్రాంతంలో మద్యం సేవించిన వారు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


మరోవైపు, బాధితులు మద్యాన్ని పొరుగున ఉన్న కాక్చింగ్‌ జిల్లాలోని సుగ్ను ప్రాంతం నుంచి కొనుగోలు చేసినట్లు చందేల్‌ జిల్లా ఎస్పీ ధర్మేంద్ర కుమార్‌ తెలిపారు. చందేల్‌ జిల్లాలో సంప్రదాయ లేదా స్థానిక మద్యం తయారీ కేంద్రాలు ఉన్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, కల్తీ మద్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఇక స్వదేశీ బర్డ్‌ఫ్లూ వ్యాక్సిన్‌

మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్‌ నేతలే రక్షించారా?

Updated Date - Nov 21 , 2026 | 08:10 AM