Share News

మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్‌ నేతలే రక్షించారా?

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:18 AM

ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనపై దర్యాప్తు జరగకుండా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతలే అడ్డుపడ్డారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ న్యాయమంత్రి వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి

మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్‌ నేతలే రక్షించారా?
moili

  • కాంగ్రెస్‌లో ప్రకంపనలుసృష్టిస్తున్న మొయిలీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనపై దర్యాప్తు జరగకుండా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతలే అడ్డుపడ్డారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ న్యాయమంత్రి వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాని ఫలితం తామిప్పుడు అనుభవిస్తున్నామని మొయిలీ అన్నారు. నాడు దర్యాప్తు కొనసాగి ఉంటే అమిత్‌ షా మాదిరే మోదీ కూడా జైలుకు వెళ్లేవారని బెంగళూరులో సోనియా ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అమిత్‌ షాను గుజరాత్‌ నుంచి బహిష్కరించారని.. ఆయన 2010లో మూడు నెలలు జైలులో ఉన్నారని మొయిలీ గుర్తు చేశారు. ఆయన తర్వాత మోదీ కూడా జైలుకు వెళ్లి రాష్ట్ర బహిష్కారం కావాల్సి ఉన్నా..అలా జరగలేదన్నారు. తమ పార్టీలో జరిగిన దురదృష్టకర సంఘటనలే అందుకు కారణమని పేర్కొన్నారు. మోదీకి వ్యతిరేకంగా దర్యాప్తు జరగకుండా పార్టీలో కొందరు అడ్డుకునారని, అందువల్ల ప్రభుత్వం ఈ దర్యాప్తును నిలిపివేసిందని తెలిపారు. కాగా కాంగ్రెస్‌ హయాంలో న్యాయ ప్రక్రియ పూర్తిగా పక్కదోవ పట్టినట్లు మొయిలీ ప్రకటనతో తేలిపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది గురువారం వ్యాఖ్యానించారు. మోదీ, షాలపై రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేశారని, వారిని ఇరికించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిన విషయం స్పష్టమవుతోందని ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 04:43 AM