భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:20 PM
ఢిల్లీలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organisation - SCO) సమావేశం కోసం పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organisation - SCO) సమావేశం కోసం పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ క్రమంలో కేంద్రం అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత సమయంలో ముసాదిక్ మాలిక్ తీవ్ర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘మా నీళ్లను ముట్టుకుంటే చేతులు నరికేస్తాం’ అంటూ ఆయన అప్పట్లో హెచ్చరికలు చేశారు. అయితే ఇప్పుడు ముసాదిక్ మాలిక్ భారత్‌లో పర్యటించడం వివాదానికి దారి ఇచ్చింది. బీజేపీ విదేశాంగ విధానం గందరగోళ మయంగా ఉందని సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఫక్రుల్ హసన్ విమర్శించారు.
మరోవైపు కాంగ్రెస్ ముసాదిక్ మాలిక్ రాకపై సెటైర్లు పేల్చింది. ఉగ్రవాదానికి ఎప్పుడూ వ్యతిరేకమని చెప్పే బీజేపీ.. పాకిస్థాన్ మంత్రిని స్వాగతిస్తోందని చురకలంటించింది. ‘విదేశి వ్యవహారాల అంశంలో కేంద్రం అయోమయ స్థితిలో ఉంది. భారతీయ క్రికెటర్లను పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆడాలని బీజేపీ కోరుతుంది. మరోవైపు అదే పార్టీ.. పాక్ మంత్రులకు ఆహ్వానం పలుకుతోంది. గందరగోళ ప్రధానమంత్రి మోదీ ఒత్తిడిలో పని చేస్తున్నట్టున్నారు’ అని ఇండి కూటమి నాయకుడు సురేంద్ర రాజ్‌పూత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి.. పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రిపై మండిపడ్డారు. గతంలో ముసాదిక్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాదుల హెచ్చరికలకు ఏమాత్రం తీసిపోవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నవంబర్ 20 నుంచి 22 వరకు ఎస్సీఓ సమావేశం జరగనుంది. ఇందులో చైనా, రష్యా, భారత్, పాకిస్థాన్, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, బెలారస్ దేశాలు పాల్గొంటాయి.
ఈ వార్తలూ చదవండి
ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..
గుబురు గడ్డం.. చేతిలో ఏకే-203.. వైరల్ కమాండోతో మళ్లీ తెరపైకి 9 పారా ఫోర్స్